మోదీ పతనం మొదలైంది : సోనియా గాంధీ | Congress Working Committee Meeting Concluded In Delhi | Sakshi
Sakshi News home page

మోదీ పతనం మొదలైంది : సోనియా గాంధీ

Published Sun, Jul 22 2018 5:33 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Working Committee Meeting Concluded In Delhi - Sakshi

న్యూఢిల్లీ : ఏపీ, తెలంగాణలోని అంశాలను ఎన్నికల సందర్భంగా పార్టీ తీసుకోవాల్సిన చర్యలను కాంగ్రెస్‌ విస్తృతస్థాయి వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తెలుగు రాష్ట్రాల పీసీసీలు ప్రస్తావించారు. రాహుల్‌ గాంధీయే ప్రతిపక్షాల ఐక్య కూటమికి నేతృత్వం వహించాలని, సచిన్‌ పైలట్‌, శక్తి సింగ్‌ గోహిల్‌, రమేశ్‌ చెన్నితల తదితర నేతలు సూచించారు. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా జరిగిన తొలి సీడబ్ల్యూసీ సమావేశం ముగిసింది.  సుమారు ఐదు గంటల పాటు సమావేశంలో 2019 ఎన్నికలకు సన్నద్ధం కావడంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఏఏ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవాలో రాహుల్‌ గాంధీకి అధికారం కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో బలంగానే ఉందని, ఆ రాష్ట్రాలపై మరింత దృష్టిపెట్టి పనిచేస్తే 150 లోక్‌సభ స్థానాలు సాధించవచ్చని సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు వెళ్లడం వల్ల మరికొన్ని స్థానాల్లో గెలుపొందవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కూర్పుపై నాయకుల్లోని సందేహాలను పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివృత్తి చేశారు. ప్రస్తుత కమిటీ అనుభవం, యువశక్తి మేళవింపుగా ఉందని, ఇది గతం, వర్తమానం, భవిష్యత్తుకు నడుమ వారధిగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకును పెంపొందించుకోవడమే పార్టీ ముందున్న అతిపెద్ద టాస్క్‌ అని అన్నారు.

ప్రతి నియోజకవర్గంలో పార్టీకి ఓటు వేయని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి వారి మనసు గెలుచుకునే విధంగా, వారిలో భరోసా కల్పించే విధంగా బూత్‌స్థాయి వరకు నాయకులు పని చేయాలని సూచించారు. మరోసారి ప్రధాని కావాలన్న వాంఛతోనే నరేంద్ర మోదీ పతనం మొదలైందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి రాష్ట్రస్థాయి చర్చలు జరపాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను సంస్థాగతంగా, ఆర్ధికంగా ఎదుర్కొనేందుకు వ్యక్తిగత ఎజెండాలను పక్కనపెట్టి, ప్రతిపక్షాలన్నీ ఐక్య కూటమిగా కొనసాగాలని సోనియా సూచించారు. ఈ సమావేశంలో రాహుల్‌ గాంధీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌, సోనియా గాంధీ, ఆజాద్, మోతీలాల్‌ వోరా, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్, అంబికా సోనీ, ముకుల్‌ వాస్నిక్, కేసీ వేణుగోపాల్‌, పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, కీలక నేతలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement