‘పాత నోట్ల’కు మరో అవకాశమివ్వాలి
► సరైన కారణాలు ఉంటే పాత నోట్లు మార్చుకోవచ్చు
► కేంద్రం, ఆర్‌బీఐలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: సరైన కారణాలు ఉండి రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్పిడి చేసుకోలేని వారికి వాటిని మార్చుకునేందుకు మరో అవకాశం కల్పించాలని, పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రత్యేక విండో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ)లను సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ తప్పేమీ లేకుండా తాము సంపాదించిన డబ్బును ప్రజలు కోల్పోవడం సరికాదని పేర్కొంది. ‘సహేతుక కారణాల వల్ల ఓ వ్యక్తి తన డబ్బును డిపాజిట్ చేయలేకపోతే అతనికి డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వకపోవడం తగదు. వారికి ప్రత్యేక విండోను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి.
ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యం వల్ల తన డబ్బును డిపాజిట్ చేయలేకపోతే ఏం చేయాలి? ఒక వ్యక్తి ఆ సమయంలో జైలులో ఉన్నట్లయితే ఎలా? అలాంటి వారు డబ్బు డిపాజిట్ చేయకుండా మీరెందుకు అడ్డుకుంటున్నారు?’ అని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూద్ లæ బెంచ్ ప్రశ్నించింది. దీనిపై రెండు వారా ల్లో స్పందన తెలియజేయాలని కేంద్రం, ఆర్బీఐలను ఆదేశించింది.
రద్దయిన పాత నోట్లను కేంద్రం, ఆర్బీఐ నిర్ధేశించిన సమ యంలో డిపాజిట్ చేయలేకపోయిన పలు వురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు మంగళవారం విచారించింది. సహేతు కమైన కారణాలతో డబ్బును డిపాజిట్ చేయలేకపోయిన వారు ఎందుకు డిపాజిట్ చేయలేకపోయారో చెప్పడానికి అవకాశం ఇవ్వాలని, వారు డబ్బును డిపాజిట్ చేసేం దుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. కేంద్ర తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ సరైన కారణాలతో డబ్బు డిపాజిట్ చేయలేక పోయిన వారి గురించి అభిప్రాయం తెలియ జేసేందుకు సమయం కావాలని కోరడంతో అందుకు కోర్టు అంగీకరించింది.