గురు భయ్యూజీ ఆత్మహత్యకు పాల్పడిన గదిలో లభించిన సూసైడ్ నోట్
ఇండోర్ : ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం తనను తాను తుపాకితో కాల్చుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక వత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖ ఆయన గదిలో లభించింది. కానీ తాజాగా ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆత్మహత్య చేసుకునే కొన్ని గంటల ముందు ఆయన ఒక రెస్టారెంటుకు వెళ్లినట్లు సీసీటీవీ పుటేజ్ ద్వారా బయటపడింది.
ఆయన రెస్టారెంటులోకి ప్రవేశిస్తునే ఫోన్లో ఎవరితోనో సంభాషిస్తున్నారు. కొంతసేపటికి ఒక టేబుల్ వద్ద కూర్చున్నారు. ఆ సమయంలో ఆయన రెండో భార్య డాక్టర్ ఆయుష్ శర్మ అక్కడికి వచ్చారు. తర్వాత భయ్యూజీ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన ఒకింత ఆదోళనగా, గాబరాపడుతున్నట్లు కనిపించారు. సూసైడ్ నోట్‌లో మానసిక వత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొన్నప్పటికి, అసలు కారణం వేరే ఉన్నట్లు ఆయన సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్తి తగాదాలు..
భయ్యూజీ ఆస్తి విషయంలో మొదటి భార్య మాధవికి, రెండో భార్య ఆయుషీ శర్మకు విభేదాలు ఉన్నాయి. తన తండ్రి మరణానికి ఆయుషీ శర్మనే కారణమంటూ మొదటి భార్య కూతురు కుహు ఆరోపించారు. ఆస్తి కోసం కుహు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిందని దాని కారణంగానే భయ్యూజీ ఆత్మహత్య చేసుకున్నారని ఆయుషీ ప్రత్యారోపణలు చేశారు.
రాజకీయ వత్తిడి..
భయ్యూజీ ఆత్మహత్యకు మధ్యప్రదేశ్ ప్రభుత్వమే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. భయ్యూజీకి వేల సంఖ్యలో అభిమానులు, భక్తులు ఉన్నారని అందుకోసం ఆయనకు మంత్రి పదవి ఇచ్చి లోబర్చుకోవాలని బీజేపీ ప్రయత్నించిందని విమర్శలు గుప్పించింది. తమ ప్రభుత్వానికి సహారించనందుకే భయ్యూజీని ఆత్మహత్య చేసుకునేలా బీజేపీ ఆయనను వేధించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భయ్యూజీకి తన క్యాబినెట్‌లో మంత్రి పదవీ ఆఫర్ చేస్తే, భయ్యూజీ దాన్ని తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment