మహిళా మంత్రి కాళ్లు పట్టుకున్న కాంట్రాక్టర్
శివపురి: మహిళా మంత్రిగారిని శాంతింపజేయడానికి ఆమె కాళ్లపై పడ్డాడో కాంట్రాక్టర్. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఐటీఐ విద్యార్థుల కోసం 120 పడకలతో శివపురిలో నిర్మించిన హాస్టల్ భవనాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జశోధర రాజె సింధియా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హాస్టల్ భవనాన్ని పరిశీలించిన మంత్రి నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయంటూ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సెల్ ఫోన్ తో భవనం లోపలి ఫొటోలు తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. పక్కాగా నిర్మాణ పనులు చేయించాలని ఆదేశించారు. తాజాగా చేసిన ప్రారంభోత్సవాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రిని శాంతింపజేసేందుకు కాంట్రాక్టర్ ఆమె కాళ్లపై పడ్డాడు. అయినా ఆమె శాంతించలేదు. తాము మంజూరు చేసిన నిధులకు అనుగుణంగా హాస్టల్ నిర్మించకుంటే ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారు.