భోపాల్ : ఇదేం విచిత్రం.. కోడిపుంజుపై కేసు పెట్టడం ఏంటని షాకవుతున్నారా? నిజమండీ బాబూ.. ఐదేళ్ల చిన్నారి బుగ్గపై కోడి పొడిచిందట. బుగ్గకు గాయమై రక్తం కూడా వచ్చిందని.. తల్లిదండ్రులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెళ్లి కోడిపుంజును తీసుకొచ్చి కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ విచిత్రం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. వివరాల్లోకెళ్తే.. శివపురీకి చెందిన పప్పు జాటవ్, లక్ష్మీ దంపతులకు సంతానం లేదు. దీంతో ఐదేళ్ల క్రితం ఓ కోడిపుంజును తీసుకొచ్చి పెంచుకుంటున్నారు.
ఎంతైనా కోడి కదా.. రోజూ చుట్టుపక్కల ఉన్న ఇళ్లవెంట తిరిగేది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పప్పు పొరిగింట్లో ఉండే ఐదేళ్ల చిన్నారి రాధిక రోడ్డుపై ఆడుకుంటోంది. ఈ లోపే ఈ కోడిపుంజు కూడా అటుగా వెళ్లింది. ఏం జరిగిందో ఏమో.. కోడిపుంజు చిన్నారి చెంపపై పొడిచింది. దీంతో చిన్నారి బుగ్గకు గాయమై, రక్తం కూడా వచ్చింది. గాయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని అడగ్గా.. కోడి పొడిచిందని చెప్పింది. దీంతో వారు పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు పప్పు ఇంటికి వెళ్లి, స్టేషన్‌కు తీసుకొచ్చి జైల్లో పెట్టారు. చివరకు లక్ష్మి బతిమాలితే.. ఇద్దరిని కూర్చోబెట్టి కేసును పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment