లక్నో: కోతులు పేలు చూస్తాయనే సంగతి మనందరికి తెలిసిందే. కోతి, కోతికి పేలు చూడటం సహజం. కానీ వానరం, మనిషికి.. అందునా ఓ పోలీసు అధికారికి పేలు చూడటం అంటే.. నిజంగా విడ్డూరమే. ఓ కోతి.. పోలీసు అధికారికి పేలు చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లా, సదర్ కొట్వాలి పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్‌కు వచ్చిన కోతి, హౌజ్ ఆఫీసర్ శ్రీకాంత్ ద్వివేది భుజాలపైకి ఎక్కి అతని.. తలలో పేలు చూడటం మొదలు పెట్టింది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే.. దాడి చేస్తుందనే ఉద్దేశంతో.. సదరు అధికారి కామ్‌గా తన పని తాను చేసుకుంటూ కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు స్టేషన్‌కు వచ్చి కోతిని పట్టుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ శ్రీవాస్తవ అనే అధికారి తన ట్విటర్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో కోతి ద్వివేది భుజాలపై కూర్చుని.. పేలు చూస్తుండగా.. అతడు మాత్రం ప్రశాంతంగా తన పని చేసుకుంటూ కూర్చున్నాడు. స్టేషన్‌లో ఉన్న మిగతా సిబ్బంది దీని గురించి చర్చించుకుంటారు.. కానీ కోతిని తరిమే ప్రయత్నం మాత్రం చేయలేదు. ‘పని చేసేటప్పుడు మీరు ఇలాంటి అవంతరాలు ఎదుర్కొకుండా ఉండాలంటే.. శిఖాకాయ్, రీతా లేదా మరో మంచి షాంపు వాడితే.. ఫలితం ఉంటుంది’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది.
ఈ విషయం గురించి శ్రీకాంత్ ద్వివేది మాట్లాడుతూ.. ‘తొలుత వానరం ఓ మహిళా కానిస్టేబుల్ వెంట పడింది. ఆమె భయంతో పరుగులు తీసింది. తర్వాత అది నా మీదకు ఎక్కింది. కదిలిస్తే.. నాపై కూడా దాడి చేస్తుందనే ఉద్దేశంతో పట్టించుకోవడం మానేసి.. ఫైల్స్ చూస్తూ కూర్చున్నాను’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment