అరటిపండు కోసం పోలీసుల ముష్టియుద్ధం
చెన్నై: ఒక్క అరటిపండు... ఇద్దరు పోలీసులు మధ్య చిచ్చు పెట్టింది. రాత్రి వేళ దొంగలు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రజలను కాపాడటం కోసం నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో వున్నవాళ్లు... ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇద్దరి మధ్య ముష్టి యుద్ధమే జరిగింది. దీంతో ఇతర సిబ్బంది జోక్యంతో వాళ్లిద్దరూ రక్తమోడుతూ ఆసుపత్రిలో చేరారు. స్వల్పవిషయానికే బహిరంగంగా ఘర్షణకు దిగి రచ్చకెక్కడం పోలీస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
పోలీసు వర్గాల కథనం ప్రకారం తిరుచునాపల్లి స్పెషల్ ఎస్ఐ రాధా, డ్రైవర్ శరవణన్ నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. శరవణన్ రాత్రి పూట తినడానికి ఓ అరటిపండు తెచ్చుకున్నాడు. దాన్ని కాస్తా ఎఎస్ఐ రాధా తినేశాడు. అంతే వాళ్లిద్దరి మధ్య గొడవ మొదలైంది. పరస్పరం బూతులు తిట్టుకుంటూ శ్రీరంగం వీధుల్లో రెచ్చిపోయారు. రక్తాలొచ్చేలా కొట్టుకున్నారు.
సహచర పోలీసులు వచ్చి వారిని విడదీసే దాకా అలా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇద్దరినీ వారించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరికీ ముక్కుల్లోనూ, పక్కటెముకల నుంచి రక్తస్రావం జరిగిందని ఆసుపత్రి సీనియర్ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.