Two policemen
-
అరటిపండు కోసం పోలీసుల ముష్టియుద్ధం
చెన్నై: ఒక్క అరటిపండు... ఇద్దరు పోలీసులు మధ్య చిచ్చు పెట్టింది. రాత్రి వేళ దొంగలు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రజలను కాపాడటం కోసం నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో వున్నవాళ్లు... ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇద్దరి మధ్య ముష్టి యుద్ధమే జరిగింది. దీంతో ఇతర సిబ్బంది జోక్యంతో వాళ్లిద్దరూ రక్తమోడుతూ ఆసుపత్రిలో చేరారు. స్వల్పవిషయానికే బహిరంగంగా ఘర్షణకు దిగి రచ్చకెక్కడం పోలీస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పోలీసు వర్గాల కథనం ప్రకారం తిరుచునాపల్లి స్పెషల్ ఎస్ఐ రాధా, డ్రైవర్ శరవణన్ నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. శరవణన్ రాత్రి పూట తినడానికి ఓ అరటిపండు తెచ్చుకున్నాడు. దాన్ని కాస్తా ఎఎస్ఐ రాధా తినేశాడు. అంతే వాళ్లిద్దరి మధ్య గొడవ మొదలైంది. పరస్పరం బూతులు తిట్టుకుంటూ శ్రీరంగం వీధుల్లో రెచ్చిపోయారు. రక్తాలొచ్చేలా కొట్టుకున్నారు. సహచర పోలీసులు వచ్చి వారిని విడదీసే దాకా అలా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇద్దరినీ వారించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరికీ ముక్కుల్లోనూ, పక్కటెముకల నుంచి రక్తస్రావం జరిగిందని ఆసుపత్రి సీనియర్ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
దుండగులు కాల్పులు : ఇద్దరు పోలీసులు మృతి
కరాచీ: పాకిస్థాన్ బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వట్టా నగరంలో గస్తీ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా... మరోకరు ఆస్పుపత్రికి తరలిస్తుండగా మరణించారని పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. క్వట్టాలోని శాటిలైట్ నగరంలో సోమవారం సాయంత్రం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు రెహ్మాన్, హఫీజుల్లాపై బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. అనంతరం దుండగులు పరారైయ్యారని చెప్పారు. రెహ్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. హఫీజుల్లా మాత్రం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. నగరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులే లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు దిగుతున్నారు. ఇటీవల కాలంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై విచక్షణరహితంగా కాల్పుల జరిపిన ఘటనలో ఎనిమిది మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఇంతవరకు ఎవరు ప్రకటించలేదు. -
లంచం ఇవ్వలేదని మహిళకు నిప్పు
బారాబంకి: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. బారాబంకి పోలీస్ స్టేషన్ వద్ద జర్నలిస్టు తల్లికి నిప్పంటించారు. ఈ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. లంచం ఇవ్వనందుకు ఇద్దరు పోలీసులు తనను అవమానించి, వేధించి, నిప్పుపెట్టారని చనిపోయేముందు బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. కాగా బాధితురాలే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పోలీసులు ఓ కేసుకు సంబంధించి రామ్ నారాయణ్ అనే వ్యక్తిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆయనను విడిపించుకునేందు కోసం భార్య నీతూ ద్వివేది పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. రామ్ నారాయణ్‌ను విడిచిపెట్టేందుకు లక్ష రూపాయలు ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారని నీతూ చెప్పింది. లంచం ఇవ్వనందుకు తనను తీవ్రంగా వేధించి నిప్పు పెట్టారని తెలిపింది. తీవ్రంగా గాయపడిన నీతూను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. కాగా పోలీసులు మాత్రం భాదితురాలే స్టేషన్ గేట్ వద్ద నిప్పుపెట్టుకుందని తెలిపారు. -
చంపేశారని ఇద్దరు పోలీసుల అరెస్టు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో పోలీసులే ఇద్దరు పోలీసులను అరెస్టు చేశారు. ఓ ఉద్రిక్త పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించి ఒకరి మృతికి మరొకరి గాయాలకు కారణమయ్యారనే పేరటి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు అసిస్టెంట్ ఎస్సై కాగా మరొకరు కానిస్టేబుల్. కశ్మీర్ వేర్పాటు నాయకుడు మస్రత్ అలంను పోలీసులు అరెస్టు చేయడంతో బుద్గాం ప్రాంతంలో అల్లర్లు నిరసనలు ఎక్కువయ్యాయి. హింసాత్మక ఘటనలు చెల రేగడంతో వాటిని నియంత్రించేందుకు ప్రయత్నించిన పోలీసులు కాల్పులు జరపగా ఒక యువకుడు మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కాల్పులు జరిపిన ఇద్దరు పోలీసులను అరెస్టు చేసింది. దీంతోపాటు ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ: ఇద్దరు పోలీసులు మృతి
బీహార్ వైశాలీ జిల్లాలోని జుదవన్పూర్ పరిధిలోని పోలీసు స్టేషన్లో గత అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో ఇరువర్గాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. మృతుల్లో స్టేషన్ ఎస్ఐతోపాటు కానిస్టేబుల్ కూడా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అందుకోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. పోలీసులు కథనం ప్రకారం ... ఇటీవల ఆ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలో ఇరువర్గాల మధ్య భూవివాదం చోటు చేసుకుంది. ఆ భూవివాదంపై తరచుగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రమంలో బుధవారం జరిగిన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. దాంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ తీవ్రమైంది. దాంతో ఓ వర్గం మరో వర్గంపై కాల్పులు జరిపింది. దీంతో రెండో వర్గం కూడా కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఊహించని ఆ పరిణామానికి ఇరువర్గాలు భయభ్రాంతులయి, కాళ్లకు బుద్ధి చెప్పి చెరో దిక్కుకు పరుగులు తీశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లోని పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.