బీహార్ వైశాలీ జిల్లాలోని జుదవన్పూర్ పరిధిలోని పోలీసు స్టేషన్లో గత అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో ఇరువర్గాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. మృతుల్లో స్టేషన్ ఎస్ఐతోపాటు కానిస్టేబుల్ కూడా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అందుకోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు. పోలీసులు కథనం ప్రకారం ... ఇటీవల ఆ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలో ఇరువర్గాల మధ్య భూవివాదం చోటు చేసుకుంది.
ఆ భూవివాదంపై తరచుగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రమంలో బుధవారం జరిగిన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. దాంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ తీవ్రమైంది. దాంతో ఓ వర్గం మరో వర్గంపై కాల్పులు జరిపింది. దీంతో రెండో వర్గం కూడా కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఊహించని ఆ పరిణామానికి ఇరువర్గాలు భయభ్రాంతులయి, కాళ్లకు బుద్ధి చెప్పి చెరో దిక్కుకు పరుగులు తీశారు. స్థానిక పోలీసు స్టేషన్లోని పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.