నా కళ్లముందే కొట్టి చంపేశారు..
న్యూఢిల్లీ: సహాయం కోసం అర్థించాను.. అరిచాను...దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు పరుగెత్తుకెళ్లి మా నాన్నను కొడుతున్నారు రక్షించమని వేడుకున్నాను. పోలీసులు నామాట వినలేదు. కనీసం కనికరం చూపలేదు.. కానీ కొంతమంది స్థానికులు మాత్రం సాయం చేశారు. అయితే అప్పటికే లేటయిపోయింది. నాన్నకు ఒళ్లంతా రక్తమే... నా కళ్లముందే ఆయన ప్రాణాలు విడిచారు. ... ఇది ఢిల్లీలో ఆదివారం చనిపోయిన షానవాజ్ పదమూడేళ్ల కొడుకు ఆవేదన.
పెద్ద దిక్కయిన షానవాజ్ చనిపోవడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. గతంలో అల్లుడిని, ఇపుడు కొడుకును పొగొట్టుకున్న ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. తన కొడుకు ఎవరికీ ఎప్పుడూ హాని తలపెట్టలేదని... అలాంటి వాడిని ఇంత దయనీయంగా ఎందుకు చంపారో అర్థం కావడంలేదంటూ షానవాజ్ తల్లి నూర్జహాన్ రోదిస్తున్నారు. కొన్ని రోజులక్రితం భర్తను పోగొట్టుకున్నతన కూతుర్ని చూసి వెనక్కి వెడుతుండగా ఈ ఘటన జరిగిందని ఆమె వాపోతున్నారు. కాగా దుండగులు... చిన్నపిల్లలని కూడా చూడకుండా కొట్టారని మృతుని భార్య ఆరోపిస్తున్నారు. తక్షణమే నిందితులను అదుపులోకి తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఢిల్లీలో స్క్రాప్ వ్యాపారం చేసుకునే 38ఏళ్ల షానవాజ్ కు ఇద్దరు కుమారులు, కుమార్త, భార్య ఉన్నారు. ఆదివారం బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా షానవాజ్, తన కారును ఢీకొట్టాడని ఆరోపిస్తూ కొంతమంది దుండగులు అతనిపై దాడిచేసి కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతణ్ని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగి కొన్ని వాహనాలను తగులబెట్టారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ పరమాదిత్య వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐపి ఎస్టేట్ ప్రాంతంలోని తుర్కమెన్ గేట్ దగ్గర ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.