
కరోనా మహమ్మారి మనిషికి పరిచయమై 4 నెలలు కూడా కాలేదుగానీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షన్నర మంది ప్రాణాలను బలితీసేసుకుంది. ఇంక కొన్ని రోజుల్లోనే అంతా అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు కానీ వాస్తవ పరిస్థితులు కొంచెం భిన్నంగానే ఉన్నాయి. ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం నిలిచిపోయినా అది ఒక్కసారిగా జరగదని దశలవారీగా అప్పుడప్పుడూ మళ్లీ విరుచుకుపడటం తప్పదని ఎపిడమాలజిస్టుల అంచనా. ఈ నేపథ్యంలో కరోనా ఇంకో ఏడాదిన్నర వరకూ కొనసాగితే ఏమవుతుంది? ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే అమెరికా వంటి దేశాల్లో ఆగస్టుకల్లా సమస్య సమసిపోతుందని అంచనా. అయితే ఇలా కాకుండా వచ్చే ఏడాది వరకూ కొనసాగితే మాత్రం విపరీత పరిణామాలను చవిచూడాల్సి ఉంటుంది. ఆహారం, వినోదం, ఆరోగ్య సేవల వంటి వాటిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా.
వినోదం విషయానికి వస్తే ఇప్పటికే దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. కాబట్టి కొత్త సినిమాలు ఇప్పట్లో వచ్చే సూచనలు లేవు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు చాలావరకూ ఆన్‌లైన్‌లో నేరుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. షూటింగ్‌లు జరగకపోవడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతారు. మరోవైపు కరోనా దీర్ఘకాలం కొనసాగితే దేశాల అప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే రూ. లక్షల కోట్లు ఖర్చు చేసింది. టెస్టింగ్, చికిత్సల కోసం భారత్ కూడా భారీగా ఖర్చు పెడుతోంది. పాఠశాలలు ఏడాదిన్నరపాటు పనిచేయకపోతే విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది.
హైస్కూల్ స్థాయి పరీక్షలు జరగకపోతే పై తరగతులకు అంటే కాలేజీలకు అడ్మిషన్లు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న వస్తుంది. ఆన్‌లైన్‌లో తరగతుల నిర్వహణ సాధారణమైపోతుంది. హోటళ్లు, బార్లు, నైట్‌క్లబ్‌లు, జిమ్‌లు, సినిమా, ఆర్ట్ గ్యాలరీలు, షాపింగ్ మాల్స్, మ్యూజియంలు, సంగీత కళాకారులు, క్రీడాకారులు, సదస్సు నిర్వాహకులు తీవ్రంగా దెబ్బతింటారని అంచనా. ఇదే సమయంలో విమాన ప్రయాణాలు తగ్గుతాయి. కరోనా కారణంగా మరణాలు కూడా ఊహించనంత పెరిగిపోతాయనడంలో సందేహం లేదు!
Comments
Please login to add a commentAdd a comment