సాక్షి, న్యూఢిల్లీ : కరోనా విపత్తు నిర్వహణ చర్యలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదివారం కేంద్ర పాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వైద్యశాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావం, లాక్‌డౌన్ మినహాయింపులు, కంటైన్‌మెంట్ జోన్లలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. కరోనా యోధులకు తగిన వసతి, సౌకర్యం కల్పించాలని సూచించారు. కరోనా విపత్తు నిర్వహణ చర్యలు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్తగా ప్రారంభించాలని ఆదేశించారు. (కార్చిచ్చులా కరోనా)
అలాగే శ్రామిక రైళ్లు నడిపేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులను చేరవేసేందుకు 350 శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని రాజీవ్ గౌబా వెల్లడించారు. ఇక వందేభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడాన్ని ఆయన వివరించారు. ఈ మిషన్‌కు అన్ని రాష్ట్రాలు సహకరించాలని కోరారు. (ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్)
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సడలింపు, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలపై చర్చించేందుకు మరోసారి ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. రేపు (సోమవారం) మధ్యాహ్నాం 3 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment