న్యూఢిల్లీ: ముందస్తు చర్యలు చేపట్టకుండానే లాక్‌డౌన్ విధించారనే విమర్శలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. విదేశాల నుంచి వచ్చేవారిని దేశంలోకి ఇష్టారీతిన అనుమతించి.. కూలీనాలీ చేసుకునే పేదలకు రవాణా సదుపాయాలు కూడా కల్పించలేదనే ఆరోపణలు అర్థరహితమని తోసిపుచ్చింది. సమగ్ర ప్రతిస్పందన వ్యవస్థ ద్వారా భారత్ కరోనా పోరులో చాలా త్వరగా స్పందించిందని కేంద్రం తెలిపింది. మిగతా అన్ని దేశాల కంటే మెరుగ్గా భారత్ క్రీయాశీల, క్రమబద్ధమైన నిర్ణయాలు తీసుకుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారశాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
(చదవండి: బ్రిటీషు పాలకులకు ‘కోవిడ్’ గండం!)
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ మార్గదర్శకాల ముందే భారత్ సరిహద్దుల వెంబడి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని వెల్లడించింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు, విదేశాల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ చేయడం, అనుమానితుల వీసాలను సస్పెండ్ చేయడం వంటి చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. భారత్‌లో తొలికేసు జనవరి 30న నమోదు కాగా.. అంతకు ముందే అంటే జనవరి 18 నుంచే థర్మల్ స్క్రీనింగ్ చర్యలు చేపట్టామని తెలిపింది. చైనా, హాంగ్‌కాంగ్ దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా స్క్రీనింగ్ చేశామని చెప్పింది.
‘కోవిడ్-19 మహమ్మారికి బలైన ఇటలీ, స్పెయిన్ దేశాల్లో తొలి కేసు నమోదైన 25 రోజులకు, 39 రోజులకు ఆయా దేశాలు స్క్రీనింగ్ మొదలు పెట్టాయి. కానీ, మనదేశం అంతకన్నా ముందే మేల్కొంది. ఎన్నో క్రియాశీల నిర్ణయాలను కేంద్రం తీసుకుంది. స్క్రీనింగ్‌తో పాటు అనుమానితులకు స్వీయ నిర్బంధం తప్పనిసరి చేశాం. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి.. క్వారైంటైన్‌లకు లేదంటే ఆస్పత్రికి తరలించాం. టూరిస్టులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు అని తేడా లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూశాం. సంపన్న భారతీయులకు ప్రత్యేక సదుపాయాలేం కల్పించలేదు. రాష్ట్రాలతో కలిసి వైరస్ నియంత్రణ చర్యలు ముమ్మరంగా చేపట్టాం.
(చదవండి: వారి పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంది: మంత్రి)
దానిలో భాగంగానే రాష్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి దాదాపు 20 వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆరుసార్లు సమీక్షలు జరిపారు. దేశ వ్యాప్తంగా 30 విమానాశ్రయాల్లో, 12 పెద్దవి, 65 చిన్న నౌకాశ్రయాల్లో, వాటితోపాటు అన్ని సరిహద్దుల్లో స్క్రీనింగ్ చేపట్టాం. దాదాపు 36 లక్షల మందికి స్క్రీనింగ్ చేశాం’ అని సమాచార ప్రసార శాఖ పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment