ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ ఉదంతం మరువకముందే మధ్య ప్రదేశ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా.. అతను ఓ సామూహిక భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలియడం కలకలం రేపుతోంది. వివరాలు.. దుబాయ్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న సురేశ్ అనే వ్యక్తి తల్లి గత నెలలో మరణించారు. దీంతో గత నెల 17 న అతను స్వస్థలం మొరేనాకు తిరిగొచ్చాడు. మార్చి 20న దశదిన కర్మ నిర్వహించి బంధువులు, కాలనీవాసులకు భోజనాలు పెట్టించాడు. దాదాపు 1500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది. అయితే, మార్చి 25న సురేశ్ జ్వరం బారినపడ్డాడు. ఓ నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రికి వెళ్లడంతో అతనికి, అతని భార్యకు కరోనా సోకినట్టు ఏప్రిల్ 2 న బయటపడింది.
(చదవండి: షాకింగ్ రిపోర్టు: జూన్ వరకు లాక్‌డౌన్ పొడిగింపు..!)
కాగా, ఆ దంపతులతో సన్నిహితంగా ఉన్న 23 మందికి పరీక్షలు నిర్వహించగా.. 10 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో మొత్తం 12 మందిని ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని మెరెనా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్సీ బండిల్ చెప్పారు. నెగెటివ్ ఫలితాలు వచ్చినవారిని ఇళ్ల వద్దే గృహ నిర్భంధంలో ఉంచామని తెలిపారు. దుబాయ్ నుంచి బయల్దేరేముందే అతనికి వైరస్ సోకిందని, కానీ లక్షణాలు బయటపలేదని డాక్టర్ వెల్లడించారు. ఇక సురేశ్ భోజనాలు ఏర్పాటు చేసిన కాలనీ మొత్తాన్ని స్థానిక యంత్రాంగం సీజ్ చేసింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, దేశ వ్యాప్తంగా 2,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 72 మంది మరణించారు. రాష్ట్రంలో 154 కేసులు నమోదయ్యాయి.
(చదవండి: కరోనా వైరస్: ‘పాజిటివ్’ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్)
Comments
Please login to add a commentAdd a comment