సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి చేయడంలో పేద ప్రజల ఆకలిదప్పులను తీర్చడంలో మిజోరం అన్ని రాష్ట్రాలకన్నా ముందుంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 145 కాగా, వారిలో 30 మంది పూర్తిగా కోలుకున్నారు. ఒక్కరు కూడా మృత్యువాత పడలేదు. ఇతర రాష్ట్రాలు లేదా దేశాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరే ఒక్కరు కరోనా వైరస్ బారిన పడ్డారు. మిజోరమ్ రాష్ట్రంలో జూన్ 22వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను ఏడవ సారి పొడిగించారు. అందుకని దాన్ని వారు ‘లాక్‌డౌన్ 7.0’ అని వ్యవహరిస్తున్నారు.
అధికారంలోఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో మాత్రం ‘యంగ్ మిజో అసోసియేషన్, మిజో వర్తకుల సంఘం, పంపిణీదారుల సంఘం’ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దుల గుండా దేశంలోకి ఎవరు చొరబడకుండా మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులో మిజో అసోసియేషన్ సభ్యులే పహరా కాస్తున్నారు. అక్కడి అసోసియేషన్ సభ్యుల జోలికి వెళ్లాలంటే భారత సైనికులే భయపడతారని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు.
ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడంలో, ముఖానికి మాస్క్‌లు ధరించడంలోనే కాకుండా రోజు విడిచి రోజుకు ఎన్ని వాహనాలను రోడ్లపైకి అనుమతించాలి, ఎన్ని దుకాణాలను తెరచి ఉంచాలనే విషయంలో అక్కడి వారు క్రమశిక్షణ పాటిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యాపారాలు మూత పడడం వల్ల ఉపాధి కోల్పోయిన పేద ప్రజలకు వర్తకుల సహకారంతో మిజో యూత్ అసోసియేషన్ సభ్యులు ఆదుకుంటున్నారు. మొదట్లో లాక్‌డౌన్ కారణంగా అన్ని వ్యాపారాలు స్తంభించి పోవడం వల్ల రోజుకు రాష్ట్రానికి 9 కోట్ల రూపాయల నష్టం జరిగిందట. ఆ నష్టాన్ని సామాజిక సంస్థల సహకారంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యదర్శి సీ. వన్‌లాల్ రామ్‌సంగా ఐదు కోట్ల రూపాయలకు తగ్గించగలిగారట. (భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు)
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ, భవన నిర్మాణ పనులను పరిమితంగా అమలు చేస్తున్నట్లు రామ్‌సంగా తెలిపారు. రాష్ట్రంలో సీరియస్ రోగులకు చికిత్స అందించేందుకు కేవలం 37 పడకలే ఉండడం, ఆక్సిజన్ వెంటిలేటర్లు కేవలం 27 మాత్రమే ఉండడంతో ముందు జాగ్రత్తలు పాటించడంలో తాము ముందున్నామని ఆయన చెప్పారు. భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తూనే తామంతా కలసి మెలసి ఉంటున్నామని, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని అక్కడి కుటుంబాలు తెలియజేశాయి. ఓ కుటుంబ సభ్యుల మధ్య ఉండే సఖ్యత కొన్ని కుటుంబాల మధ్య ఎలా ఉంటుందని ప్రశ్నించగా తామంతా ఒకే జాతివాళ్లమని, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరికి తెల్సిన వాళ్లేనని వారు చెప్పారు. (వినూత్న ఆలోచన.. విద్యార్థులకు బోధన!)
Comments
Please login to add a commentAdd a comment