
చంఢీగర్: మహమ్మారి కరోనా విజృంభణ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 16 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 3 లక్షల 80 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో సైతం ప్రాణాంతక కోవిడ్‌తో 10 మంది మృతి చెందగా.. 500 మందికి పాజిటివ్ అని తేలింది. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వగా.. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. అయితే, ప్రజల్లో మాత్రం సీరియస్‌నెస్ కనిపించడం లేదు. రవాణా వ్యవస్థపై తీవ్ర ఆంక్షలు ఉన్నప్పటికీ రోడ్లపైకి వస్తున్నారు.
దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులకు జరిమానాలతో పాటు, అవసరమైతే కేసులూ పెడుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ పోలీసులు కొందరు వాహనదారులకు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లఘించిన వాహనదారులను నడిరోడ్డుపై పడుకోబెట్టి.. ‘రూల్స్‌ని పాటిస్తాం.. ఇంకోసారి రోడ్లపైకి రాబోము’ అని చెప్పిస్తున్నారు. ఈ వీడియోను పంజాబ్ ఐపీఎస్ అధికారి పంకజ్ నైన్ ట్విటర్‌లో పోస్టు చేయగా వైరల్ అయింది. ‘సామాజిక దూరం పాటించకపోతే.. ఇలాంటి శిక్షలు తప్పవు. దూరం దూరంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి. ఇది పిక్‌నిక్ టైమ్ కాదు’ అని ఐపీఎస్ అధికారి క్యాప్షన్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment