
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అడ్డుకునే టీకాను రూపొందించే పరిశోధనల్లో భారత్‌లో దాదాపు 30 బృందాలు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయరాఘవన్ చెప్పారు. భారీ పరిశ్రమలు, సంస్థలు, సైంటిస్ట్‌లు వేర్వేరుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారన్నారు. వీటిలో సుమారు 20 పరిశోధనలు మంచి పురోగతి సాధించాయన్నారు. అవి అక్టోబర్ నాటికి క్లినికల్ ట్రయల్స్ స్థాయికి చేరే చాన్సుంది. టీకాను రూపొందించేందుకు సాధారణంగా కనీసం పదేళ్ల సమయం పడుతుందని, దాదాపు 30 కోట్ల డాలర్ల ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రపంచమంతా ఇప్పుడు వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమయిందని, సంవత్సరంలోపు టీకాను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.