పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు: మోదీ
ఘజీపూర్: దేశం కోసం పోరాటం చేయడానికి గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సోమవారం ఉత్తరప్రదేశ్ ఘజీపూర్‌లో బీజేపీ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయాన్ని సామాన్యులు సహకరిస్తుంటే... నల్ల కుబేరులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. అయితే నోట్ల రద్దుతో ఆదాయపన్ను ఎగ్గొట్టేవారు నిద్రమాత్రలు వేసుకుంటున్నారని, అవినీతిపరులే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా ఆ ప్రధాని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. బ్లాక్ మనీ విషయాన్ని హస్తం పార్టీ తప్పుదోవ పట్టిస్తోందన్న ఆయన కాంగ్రెస్ టెర్రరిస్టులకు మద్దతు పలుకుతుందా అని నిలదీశారు. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని విపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పేదల కష్టం గురించి వాళ్లందరి కంటే తనకే బాగా తెలుసని మోదీ వ్యాఖ్యానించారు. నెహ్రూ కుటుంబ సభ్యులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎమర్జెన్సీని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ...దేశాన్ని జైల్లో పెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. నోట్ల రద్దు తర్వాత కొన్ని రాజకీయ పార్టీలకు పెద్ద సమస్య వచ్చిందంటూ మోదీ ఎద్దేవా చేశారు.
దేశంలో డబ్బుకు కొదవ లేదని, కాకపోతే ఉండాల్సిన చోటే డబ్బు లేదని అన్నారు. పేదల త్యాగం వృథా కానివ్వమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఓటు ద్వారానే మార్పు సాధ్యమని మోదీ ఉటంకించారు. తమది పేదల ప్రభుత్వమని ఆయన అన్నారు. అవినీతిపరులే నల్లధనం గురించి ఆందోళన చెందుతున్నారని, సామస్యుల ఇబ్బందులు తనకు తెలుసునని మోదీ పేర్కొన్నారు.
సామాన్యుల పరిరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, దేశంలో అవినీతికి తావులేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఓటు ద్వారా అవినీతి వద్దని చెప్పాలని ఆయన కోరారు. నల్లధనంపై యుద్ధనికి సహకరించాలన్నారు. తాను కేవలం 50రోజుల వ్యవధి మాత్రమే అడిగానని మోదీ తెలిపారు.