న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే వాహనాన్ని ఢీకొట్టిన ఇండికా కారు డ్రైవర్ గుర్వీందర్‌సింగ్‌కు స్థానిక న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఘటనాస్థలి వద్ద 32 ఏళ్ల గుర్వీందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు గుర్వీందర్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయమై సంయుక్త పోలీస్ కమిషనర్ ఎం.కె.మీనా వెల్లడించారు. కోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ సిగ్నల్ ఉండగానే గుర్వీందర్ తన కారును ముందుకు పోనిచ్చాడా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
నిందితుడు దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంత నివాసి అని చెప్పారు. ఇదిలాఉంచితే ప్రమాదం విషయమై నిందితుడు గుర్వీందర్‌సింగ్ స్నేహితుడు అశోక్ గుజ్జార్ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రమాదం జరిగిన సమయంలో తాను జన్‌పథ్ ప్రాంతంలో ఉన్నా. సమాచారం అందగానే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వె ళ్లా. కారు నడపడం అతనికి బాగానే వచ్చు. అంతేకాకుండా అతనికి సిగ్నల్ ఉండగానే ముందుకుపోయే అలవాటు లేనేలేదు’ అని అన్నాడు. ఎటువంటి కార్లనైనా నడుపుతాడని, మెర్సిడెజ్, ఫోర్డ్ ఎండీవర్ వంటి కార్లను సైతం నడుపుతాడన్నారు. కేంద్రమంత్రి గోపీనాథ్ మృతికి కారకుడైన గుర్వీందర్‌పై పోలీసులు నిర్లక్ష్యం అభియోగం కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తొలుత ఇంటెలిజెన్స్‌వర్గాలు సైతం గుర్వీందర్‌సింగ్‌ను విచారించినట్టు తెలియవచ్చింది.
ఆ తర్వాత పోలీసులు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి పునీత్ ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి ఇది జామీను ఇవ్వదగిన నేరమేనని పేర్కొంటూ 14 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించేందుకు నిరాకరించారు. కాగా ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు (ఐబీ) విచారణ జరుపుతున్నాయని, అందువల్ల తమ కస్టడీకి అప్పగించాలని అంతకుముందు న్యాయమూర్తిని కోరారు. కుట్ర ఉందని తేలితే అప్పుడు పోలీసులు తమ కస్టడీకి నిందితుడి అప్పగింత కోసం అభ్యర్థించొచ్చన్నారు. కాగాగుర్వీందర్‌సింగ్‌ను నగరంలోని ఇంపీరియల్ హోటల్ కారు డ్రైవర్ అని తొలుత భావించారు. అయితే సింగ్ తమ హోటల్ ఉద్యోగి కాదని, సిల్వర్ సర్వీస్ ఉద్యోగి అని, ప్రమాదం జరిగిన సమయంలో అతను విధుల్లో లేడని పేర్కొంటూ ఇంపీరియల్ హోటల్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
కేజ్రీవాల్ సంతాపం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ దివంగత కేంద్రమంత్రికి హృదయపూర్వక నివాళులర్పించారు. ‘ఈ వార్త వినాల్సి రావడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి హృదయపూర్వక నివాళులు’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు.
ముండే కేసు డ్రైవర్‌కు బెయిల్
Published Tue, Jun 3 2014 10:06 PM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM
Advertisement
Advertisement