చెన్నైలో పూర్తి లాక్‌డౌన్ ప్రకటించడంతో శనివారం ప్రజలు మార్కెట్‌లోకి ఇలా పోటెత్తారు
న్యూఢిల్లీ: భారత్‌లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు కొత్త కరోనా కేసులు ఆరు శాతం పెరిగాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 100 దాటిన తర్వాత ఒకరోజులో కేసుల వృద్ధి అత్యల్పంగా నమోదు కావడం ఇదే తొలిసారి అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి సగటున 9.1 రోజుల సమయం పడుతోందని తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి మంత్రుల బృందం 13వ సమావేశం శనివారం జరిగింది.
దేశవ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్లలో భద్రతా చర్యలు, కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, ఐసోలేషన్ బెడ్లు, ఐసోలేషన్ వార్డులు, పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్ల లభ్యతపై చర్చించారు. ప్రస్తుతం దేశంలో రోజుకు లక్షకుపైగా పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు ఉత్పత్తి అవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 104 సంస్థలు పీపీఈ కిట్లను, మరో మూడు సంస్థలు ఎన్95 మాస్కులను తయారు చేస్తున్నాయని వివరించింది.
మెరుగైన స్థితిలో భారత్
దేశంలో కరోనా మహమ్మారి బారినపడిన వారిలో కేవలం 3.1 శాతం మంది మరణిస్తున్నారని, 20 శాతానికిపైగా బాధితులు కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ విషయంలో ప్రపంచంలోని చాలా దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉన్నామని చెప్పింది. దేశవ్యాప్తంగా దాదాపు 92 వేల ఎన్జీవోలు, స్వయం సహాయక సంఘాలు, పౌర సంఘాలు వలస కూలీలకు ఆహారం అందజేస్తున్నాయని ప్రకటించింది.
‘ఆ కిట్ల వాడకాన్ని ఆపేయండి’
కరోనా వైరస్ నిర్ధారణ కోసం ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్ల వాడకాన్ని నిలిపివేయాలని అధికార వర్గాలు శనివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించాయి. చైనా కిట్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటి కచ్చితత్వాన్ని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మళ్లీ పరీక్షించాల్సి ఉందని వెల్లడించాయి.
‘కరోనా’ మరణాలు 779
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విలయం కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు.. 24 గంటల వ్యవధిలో 56 మంది కరోనా బాధితులు మరణించారు. అలాగే కొత్తగా 1,490 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటిదాకా 779 మంది ప్రాణాలు కోల్పోయారని, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కు ఎగబాకిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 18,953 కాగా, 5,209 మంది చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం బాధితుల్లో 20.88 శాతం మంది పూర్తిగా కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment