న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దేశంలో వరుసగా నాలుగో రోజు 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,909 కేసులు బయటపడ్డాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. తాజాగా 217 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 2,07,615కి, మరణాలు 5,815కి చేరాయి.
ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 1,01,497 కాగా 1,00,303 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 31,333 మంది, తమిళనాడులో 13,706, గుజరాత్‌లో 11,894 మంది కోలుకున్నారని తెలియజేసింది. రికవరీ రేటు 48.31 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 2.80 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన దేశాల జాబితాలో భారత్ 7వ స్థానానికి ఎగబాకింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే, స్పెయిన్, ఇటలీ వరుసగా తొలి 6 స్థానాల్లో నిలిచాయి.
అండమాన్‌లో 100% రికవరీ రేటు
రికవరీ రేటు విషయంలో అండమాన్ నికోబార్ తొలిస్థానంలో నిలుస్తోంది. ఇక్కడ కరోనా బాధితులంతా(33 మంది) కోలుకున్నారు. పంజాబ్‌లో 86.12 శాతం, గోవాలో 72.15 శాతం, చండీగఢ్‌లో 71.09 శాతం మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు 50 శాతానికిపైగానే నమోదైంది.
40 లక్షలు దాటిన ఆర్‌టీ–పీసీఆర్ టెస్టులు
వైరస్ నిర్ధారణ కోసం నిర్వహించిన ఆర్‌టీ–పీసీఆర్ టెస్టుల సంఖ్య బుధవారం నాటికి 40 లక్షల మార్కును దాటినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉదయం 9 గంటలకల్లా 41,03,233 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. 24 గంటల్లో 1,37,158 టెస్టులు చేసినట్లు తెలియజేసింది. మొత్తం 688 ల్యాబ్‌ల్లో రోజుకు 1.4 లక్షల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రోజుకు 2 లక్షల టెస్టులు చేసేలా సామర్థ్యాన్ని పెంచుతున్నామని వివరించింది.
15 రోజుల్లో రెట్టింపైన కేసులు
భారత్‌లో జనవరి 30న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి10 నాటికి 50 కేసులు బయటపడ్డాయి. మే 18న లక్షకు చేరుకున్నాయి. అంటే 110 రోజుల్లో లక్ష కేసులు నమోదయ్యాయి. తర్వాత మరో లక్ష కేసులు నమోదు కావడానికి 15 రోజుల సమయమే పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment