గువాహటి: పేర్లు ఒకేలా ఉండటం.. మాస్కులు ధరించడంతో కరోనా నుంచి కోలుకున్న పేషంట్‌కు బదులు యాక్టివ్ పేషంట్ ఒకరు డిశ్చార్జ్ అయిన ఘటన అస్సాంలోని దరంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మంగళదోయి ప్రభుత్వాస్పత్రిలో గురువారం జరిగిన ఈ పొరపాటుతో ఆస్పత్రి యాజమాన్యంతో పాటు, ప్రజలు హడలిపోయారు. పేర్లలో గందరగోళం కారణంగానే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి బదులు.. వైరస్ యాక్టివ్ పేషంట్‌ను డిశ్చార్జ్ అయ్యారని ఆస్పత్రి యాజమాన్యం శనివారం వెల్లడించింది.
కరోనా నుంచి కోలుకున్న 14 మంది పేర్లను ఆస్పత్రి సిబ్బంది పిలిచారు. దాంతో తన పేరు కూడా పిలిచారనుకుని ఓ కోవిడ్ యాక్టివ్ పేషంట్ స్పందించాడు. దానికితోడు రోగి మాస్కుతో ఉండటంతో.. వైద్య సిబ్బంది అతన్ని పొరపాటుగా డిశ్చార్జ్ చేశారు. అయితే, తమ తప్పు తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం సదరు పేషంట్‌ను అదే రాత్రి అంబులెన్స్‌లో తిరిగి ఆస్పత్రికి రప్పించింది. కాగా, శుక్రవారం నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో సదరు పేషంట్‌కు నెగటివ్‌గా రిపోర్టు వచ్చిందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. మరలా అతన్ని డిశ్చార్జ్ చేశామని పేర్కొంది.
(చదవండి: ఆఫ్రిది కోలుకోవాలి.. అంతకంటే ముందుగా: గౌతీ)
ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని దరంగ్ డిప్యూటీ కమిషనర్ దిలీప్‌కుమార్ బోరా తెలిపారు. తప్పుగా డిశ్చార్జ్ అయిన వ్యక్తి ఇంటిని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. అతని కుటుంబ సభ్యుల స్వాబ్ నమూనాలను కోవిడ్ పరీక్షల కోసం పంపామని చెప్పారు. ఇదిలాఉండగా.. అస్సాం వ్యాప్తంగా 3,600 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 2 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 8 మంది మృతి చెందారు.
(చదవండి: ఇకపై కరోనా లక్షణాల్లో ఇవి కూడా..)
Comments
Please login to add a commentAdd a comment