
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతక కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు.. త్వరలోనే వర్చువల్ కోర్టులు ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించింది. తద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లతో కేసుల విచారణ జరుగుతుందని సుప్రీం జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం తెలిపారు. కోర్టుల పరిధిలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలో వర్చువల్ కోర్టులను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ట్రయల్ కోర్టుల్లో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉన్నాయని, కేసుల విచారణ విషయమై అన్ని హైకోర్టులతో చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే సంప్రదిస్తున్నారని తెలిపారు.
(చదవండి: కరోనా లక్షణాలు దాస్తే 6నెలల జైలు శిక్ష)
ఈ మేరకు.. వైరస్ వ్యాప్తి నియంత్రణకు తొలి అడుగు వేశామని, ఇక కేసులను డిజిటల్ ఫైలింగ్ చేయడం, వర్చువల్ కోర్టులను ప్రారంభించడమే తదుపరి లక్ష్యమని చంద్రచూడ్ చెప్పారు. కోర్టుల్లో స్క్రీనింగ్ ప్రారంభించామని తెలిపారు. కాగా, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భారత్‌లోనూ పంజా విసురుతోంది. మన దేశంలో ఈ వైరస్‌బారిన పడి ఇప్పటికే ఇద్దరు మరణించగా.. 107 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తామని సుప్రీంకోర్టు గత శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. కోర్టు కార్యకలాపాలపైన పరిమితి విధించిన అత్యున్నత న్యాయస్థానం.. కోర్టు రూముల్లో వాది, ప్రతివాది, లాయర్లకు మాత్రమే అనుమతి ఇస్తామని, ప్రజలు సహకరించాలని కోరింది.
(ఏం నాయనా.. మీకు కనిపించడం లేదా?: అశ్విన్)
Comments
Please login to add a commentAdd a comment