సంక్రాంతి అంటేనే ముఖ్యంగా రైతన్నల పండుగ. పంట చేతికి వచ్చిన తర్వాత జరుపుకొనే తొలి పండుగ కావడంతో అన్నదాతలు ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకొంటారు. అందమైన రంగవల్లులు, డూడూ బసవన్నల ఆటలు, పతంగుల విహారాలు, హరిదాసుల గానామృతంతో పల్లెలు పరవశిస్తుంటాయి. పంటను పండించే క్రమంలో కర్షకుడికి చేదోడువాదోడుగా ఉండే ఎద్దులు, గోమాతలను అందంగా అలంకరించి పూజించుకుంటారు. అంతేకాకుండా ఎడ్ల బండ్లను తిప్పే కార్యక్రమంతో సందడి తెలుగు రాష్ట్రాల రైతన్నలు సందడి చేస్తే.. కోడి పందాలతో పందెం రాయుళ్లు హల్‌చల్ చేస్తుంటారు.
ఇదే తరహాలో బెంగళూరులో కూడా మకర సంక్రాంతి రోజును ఘనంగా జరుపుకొంటారు. తమ పంటలకు, పశువులకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటూ తరతరాలుగా అగ్నిపై నుంచి పశువులను దాటించే ఆచారాన్ని పాటిస్తారు. ఇందులో భాగంగా గోమాతలకు పూలమాలలు అలంకరించి, మెడలో గంటలు కడతారు. ఆ తర్వాత కొంతమంది యువకులు కలిసి మంటలపై నుంచి వాటిని దాటిస్తారు. ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని, పంటలు బాగా పండుతాయని అదే విధంగా పశుపక్ష్యాదులు ఆరోగ్యంగా ఉంటాయని వారు నమ్ముతారు. ఇక పొంగల్ వేడుకల్లో భాగంగా సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టును తమిళ తంబీలు ఘనంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment