పవన్ కల్యాణ్ హీరోలా వచ్చి..జీరోలా వెళతాడు..
న్యూఢిల్లీ : కాపుల కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష చేసి, ఆస్పత్రిలో ఉంటే... జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఓ జోకర్ అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణ శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఓ వైపు కాపు ఉద్యమం జరుగుతుంటే వారికి అండగా ఉంటానన్న ఆయన ఇప్పుడు ఎక్కడ పడుకున్నారని ప్రశ్నించారు. పవన్ అప్పుడప్పుడు హీరోలా వచ్చి జీరోలా వెళుతున్నారని ఎద్దేవా చేశారు. జిమ్మిక్కులు చేస్తున్న పవన్ చెప్పే నీతులు వినడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరని నారాయణ అన్నారు.
పనిలో పనిగా టీఆర్ఎస్ పార్టీపై నారాయణ విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్పై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కోదండరాం మీద దాడిచేస్తే టీఆర్ఎస్ తన పతనానికి పునాది వేసుకోవడమే అని అన్నారు. విమర్శ ఎందుకు చేశారో తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవటమే వివేకమన్నారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కోదండరామ్ను ఉపయోగించుకుని, ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాలపై విమర్శల దాడి, నిర్భంధాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
మీడియా ప్రసారాలను ఆపడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఒకరోజు అధికారపక్షం తిరిగి ప్రతిపక్షంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు వైఫల్యాల వల్లే ముద్రగడ సహా కాపులు దీక్షకు దిగారని చెప్పారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని బాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానికత సాధించిన చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదా, రిజర్వేషన్లను ఎందుకు సాధించడం లేదని ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పెదవి విప్పడం లేదెందుకు? అని సూటిగా సీపీఐ నారాయణ ప్రశ్నించారు.