నేడు తెలంగాణ బంద్
-
పోలవరం బిల్లుకు నిరసనగా టీజేఏసీ పిలుపు
-
టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా మద్దతు
-
బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్‌కు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: పోలవరం బిల్లు ఆమోదానికి నిరసనగా శనివారం తెలంగాణ బంద్‌కు టీ-జే ఏసీ పిలుపునిచ్చింది. ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే సవరణ బిల్లుకు శుక్రవారం లోక్‌సభలో ఆమోదం లభించిన నేపథ్యంలో టీ-జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని కార్యాలయంలో అత్యవసర భేటీ జరిగింది.
అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల సరిహద్దులను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా మార్చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. నీటి లభ్యత, పర్యావరణ అనుమతులు, ప్రజాభిప్రాయ సేకరణ వంటి కీలక అంశాలను పట్టించుకోకుండా ఏడు మండలాల గిరిజనులను పోలవరంలో ముంచేయాలని కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇందుకు నిరసనగా శనివారం తెలంగాణ బంద్ నిర్వహిస్తున్నట్లు కోదండరాం తెలిపారు.
బోనాల దృష్ట్యా ఈ బంద్ నుంచి సికింద్రాబాద్‌ను మినహాయించారు. కాగా, బంద్‌కు మద్దతిస్తున్నట్లు టీఆర్‌ఎస్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యపై అన్ని రకాలుగా పోరాడుతామని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ తెలిపారు. బంద్‌లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలవరంపై కేంద్రం తొందరపాటు చర్య తీసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా టీ-జేఏసీ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.
కాగా, పార్లమెంట్‌లో పోలవరం బిల్లుపై కీలక చర్చ జరుగుతున్న తరుణంలో అఖిలపక్ష బృందంతో సీఎం కేసీఆర్ ఢిల్లీకి రాకపోవడం బాధాకరమని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఒంటెద్దు పోకడతో తెలంగాణకు కేంద్రం అన్ని విధాలా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఇక లోక్‌సత్తా కూడా కేంద్రాన్ని తప్పుబట్టింది. ఎన్డీయే ప్రభుత్వం తప్పటడుగులు వేయడం ప్రారంభించిందని పార్టీ అధ్యక్షుడు కె.ధర్మారెడ్డి విమర్శించారు.
తెలంగాణ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం చర్య దుర్మార్గమని, గిరిజనులకు శాపమని సీపీఎం, సీపీఐ నేతలు ధ్వజమెత్తాయి. బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అంతకుముందు న్యూడెమొక్రసీ కార్యాలయంలో లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. బంద్‌కు తాము కూడా మద్దతిస్తున్నట్లు న్యూ డెమొక్రసీ నేతలు సాధినేని వెంకటేశ్వర్‌రావు, కె.గోవర్ధన్ తెలిపారు.