
ఆ క్రెడిట్ అంతా నాన్నదే...
పాల్గర్: ముంబై శివసేన బంద్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకొని ఒక్కసారిగా నేషనల్ సెలబ్రిటీగా మారిపోయన షాహీన్ ఇన్నేళ్ల తన పోరాటం ఫలించిందని సంబరపడుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే సెక్షన్ 66 ఎను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఈ క్రెడిట్ నీదంటే.. నీదంటూ.. ఈ తండ్రీ కూతుళ్లు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ క్రెడిట్ అంతా నాన్నకే ... నాన్న తనకు చాలా ధైర్యం చెప్పారని షాహీన్ పొంగిపోతోంది. మరోవైపు తన బిడ్డ ఎలాంటి తప్పూ చేయలేదనీ.. ..అందుకే తనకు అండగా నిలబడ్డానని, ధైర్యంగా పోరాడిన తన బిడ్డదే ఈ విజయమని షాహీన్ తండ్రి మొహమ్మద్ ఫరూఖ్ సుప్రీం తీర్పు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ముంబైలో శివసేన అధినేత బాల్ థాకరే మృతికి సంఘీభావంగా శివసేన పిలుపునిచ్చిన రాష్ట్రబంద్ను వ్యతిరేకించి 2012లో షాహీన్ తన ఫేస్బుక్ అకౌంట్లో కామెంట్లు పోస్ట్ చేసింది. దీంతో వివాదం రగులుకుంది. షాహీన్ పోస్ట్ను లైక్ చేసి ఆమె స్నేహితురాలు రేణు శ్రీనివాసన్ కూడా వివాదంలో ఇరుక్కుంది.
స్థానిక పోలీసులు ఇద్దరు స్నేహితురాళ్లను 10రోజులపాటు అక్రమ నిర్బంధంలో ఉంచారు. దాంతో పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా వారు చేపట్టిన ఉద్యమానికి భారీ మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో జాతీయ మానవహక్కుల కమిషన్ జోక్యం చేసుకుని...మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్నేహితురాళ్లకు యాభై వేల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించింది.
మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛను సెక్షన్ 66 ఎను రద్దు చేయాలంటూ స్నేహితురాళ్లతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా సుప్రీంకోర్టులో దావా వేసిన సంగతే తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే సుప్రీంకోర్టు మంగళవారం సెక్షన్ 66 ఎను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై పలు హక్కలు సంఘాలు, ప్రజాసంఘాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.