కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఇష్టారాజ్యం
కర్నూలులో 60 ఏళ్లకుపైగా ఉన్న అంజుమన్ ఈ షంషియా మదర్సా కమిటీ మార్పు
నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరుడికి అధ్యక్ష పదవి
రూ.10 కోట్ల విలువైన మదర్సా ఆస్తులపై కన్ను
నిబంధనలను కాదని మైనార్టీ కార్పొరేషన్ ఉద్యోగి సంక్షేమ శాఖలో విలీనం
నంద్యాలలో రూ.58 కోట్ల విలువైన స్థలం కబ్జా!
మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో జరుగుతున్న రూ.14కోట్ల విలువైన పనులు నిలిపివేత
మంత్రితో మాట్లాడి ఆపై పనులు చేయాలని కాంట్రాక్టర్లకు హుకుం
రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అధికారం అండతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రెచ్చిపోతున్నారు. నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఫరూక్.. ఈ జిల్లాలోని వక్ఫ్‌బోర్డు ఆస్తులు, మదర్సాలను గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. వారిపై ఆస్తుల కబ్జా ఆరోపణలూ వస్తున్నాయి. వీరి చర్యలను సొంత పార్టీలోని ఓ మంత్రి, ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా మంత్రి, ఆయన కుమారుడు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చెప్పినట్లు చేయని ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కర్నూలు
కర్నూలు పాతబస్తీ గడ్డా వీధిలో ‘అంజుమన్ ఈ షంషియా మదర్సా’కు 60 ఏళ్లకు పైగా ఉన్న కమిటీని మంత్రి తొలగించి, అన్ని నిబంధనలను ఉల్లంఘించి తన వారిని నియమించుకోవడం మైనార్టీల్లో కలకలం రేపింది. కర్నూలు తొలి మునిసిపల్ చైర్మన్ సలాం ఖాన్ ఈ మదర్సాకు ఆస్తులు రాసిచ్చారు. అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులే చైర్మన్‌గా దానిని నడిపిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కమిటీని గౌరవించేవారు. ఈ కమిటీ కాలపరిమితి ఫిబ్రవరితో ముగిసింది. వక్ఫ్ బోర్డు సభ్యులే కమిటీని రెన్యువల్ చేయాల్సి ఉంది.
అప్పట్లో వక్ఫ్ బోర్డు లేనందున, రెన్యువల్ జరగలేదు. ఇప్పటికీ, బోర్డు ఏర్పడలేదు. కమిటీ రెన్యువల్, కొత్త కమిటీని నియమించే అధికారం బోర్డు సీఈవోకు లేదు. అయినా మంత్రి ఆదేశాలతో ఈ నెల 8న ఐదుగురితో కొత్తగా కమిటీని నియమిస్తూ వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ సిఫార్సు చేయడం, అదే రోజు సీఈవో నియామకం ఉత్తర్వులు జారీ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. కొత్త అధ్యక్షుడు షేక్ అబ్దుల్ జబ్బార్ స్థానికుడు కాదు. నిబంధనల మేరకు స్థానికేతరుడికి కమిటీలో చోటే కల్పించకూడదు. కానీ ఏకంగా అధ్యక్షుడినే చేశారు.
కూటమి ప్రభుత్వంలో మరో మంత్రి, టీడీపీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా ఈ మదరసా విషయంలో జోక్యం చేసుకోవద్దని కొరినా, మంత్రి లెక్క చేయలేదని సమాచారం. ఈ మదరసాకు రూ.10 కోట్లకు పైగా విలువైన ఆస్తులు, భూముల అద్దె, ఆదాయంపై పెత్తనం కోసమే కమిటీని మార్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సలాంఖాన్ వారసులు కోర్టులో సవాల్ చేసినట్లు సమాచారం.
జీఏడీ, ఆర్థికశాఖను కాదని కార్పొరేషన్ ఉద్యోగి ప్రభుత్వంలో విలీనం
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సబిహా ఫరీ్వన్‌ను మైనార్టీ సంక్షేమ శాఖలో విలీనం చేయడమూ విమర్శలకు దారితీసింది. సాధారణంగా కార్పొరేషన్ ఉద్యోగిని ప్రభుత్వంలో విలీనం చేయరు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే జీఏడీ, ఆర్థికశాఖ ఆమోదం తీసుకోవాలి. కానీ జీఏడీ, ఆర్థికశాఖను బైపాస్ చేసి ప్రభుత్వం మంగళవారం జీవో 110 జారీ చేసింది.
కార్పొరేషన్‌లో సరిపడినంత సిబ్బంది లేనందున ఆమెను మైనార్టీ సంక్షేమ శాఖలో విలీనం చేసేందుకు నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ ఇచ్చేందుకు కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిరాకరించింది. అయినప్పటికీ మంత్రి ఫరూక్ ఒత్తిడితో ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది. పైగా నాన్ గెజిటెడ్ ఉద్యోగి అయిన సబియాను గెజిటెడ్ ర్యాంకులో నియమించడమూ నిబంధనలకు విరుద్ధమే.
నంద్యాలలో రూ.58 కోట్ల విలువైన స్థలం కబ్జా!
నంద్యాలలో పద్మావతి నగర్ అత్యంత విలువైన ప్రాంతం. ఇక్కడ ఫరూక్ మేనత్తకు సర్వే నంబర్ 706–ఏ9లో 1.16 ఎకరాల స్థలం ఉంది. ఆమె వారసులు ఖతీఫ్ ఖాజా హుస్సేన్, నూర్ అహ్మద్ అందులో 28 సెంట్లు రామిశెట్టి వెంకటన్నకు, 30 సెంట్లు నిమ్మకాయల బాలనారాయణకు విక్రయించారు. ఇక్కడ సెంటు కోటి రూపాయల పైనే ఉంది. ఈ లెక్కన ఈ స్థలం విలువ రూ.58 కోట్లు చేస్తుంది. ఈ స్థలం పక్కనే సర్వే నంబర్ 700ఏలో మంత్రి ఫరూక్ స్థలం ఉంది. దీంతో పక్కనే బంధువులు విక్రయించిన ఆస్తిని కబ్జా చేసేందుకు యతి్నంచారు.
ఈ స్థలంపై ఇరువర్గాలు కోర్టులను ఆశ్రయించాయి. అయితే ఎక్కడా ఫరూక్ తన ఆస్తి అని నిరూపించుకోలేకపోయారు. దీంతో తమ స్థలానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్‌టీ) నిర్ధారించాలని వెంకటన్న, బాలనారాయణ మునిసిపల్ అధికారులను కోరగా.. ఆర్వో వెంకటకృష్ణ, ఆర్‌ఐ గులాం హుస్సేన్ ఆ స్థలానికి రూ.55,980 ట్యాక్స్ నిర్ధారించారు.
దీనిపై మంత్రి పీఏ అనిల్ ఈ నెల 20న మునిసిపల్ ఆఫీసుకు వెళ్లి వారితో ఎలా ట్యాక్స్ తీసుకుంటారంటూ బూతులతో విరుచుకుపడ్డారు. అదే రోజు ఆర్‌వో, ఆర్‌ఐని అధికారులు సస్పెండ్ చేశారు. మంత్రి అధికార బలంతోనే వారిని సస్పెండ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
కమిటీ తొలగింపు పై హైకోర్టులో కేసు వేశాం
మా తాత సలాంఖాన్ కర్నూలు మునిసిపాలిటీ తొలి చైర్మన్. ఆయన మదరసా ఏర్పాటు చేశారు. దానికి మా పూరీ్వకులు ఆస్తులు ఇచ్చారు. తరాలుగా ఆస్తులను కాపాడుతున్నాం. ఒక్క రూపాయి మేం వాడుకోం. మదర్సాకు 60 ఏళ్లకుపైగా మా కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షుడిగా మా కుటుంబ సభ్యులే ఉండాలి. అధ్యక్షుడు నచ్చిన వారిని సభ్యులుగా నియమించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఒత్తిళ్లతో కమిటీని మార్చారు. దీనిపై హైకోర్టులో కేసు వేశాం. – అల్తాఫ్‌ఖాన్, మాజీ అధ్యక్షులు, షంషియా మదర్సా
ఆ స్థలం మా పెద్దల నుంచి వచ్చింది
నంద్యాల సర్వే నంబర్ 700ఏ7బీ, 709ఏ9లో 4.16 ఎకరాల భూమిని మేము కబ్జా చేయలేదు. ఆ స్థలం మా పెద్దల నుంచి సంక్రమించింది. ఎన్‌ఎండీ ఫరూక్ మేనత్త సారంబి వారసులు వారి వాటా ఆస్తిని వెంకటన్న, బాలనారాయణకు విక్రయించారు. ఆ సమయంలో హద్దులు మార్చి 2010లో రిజిస్టర్ చేయించారు.
ఆ డాక్యుమెంట్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా, మొదట హద్దులు సవరించాలని.. ఆ పరిధి కోర్టుది కాదని తెలియజేస్తూ కోర్టు కేసును తిరస్కరించింది. ఇదే స్థలానికి చెందిన మరో కేసు సారంబి వారసులు, జైనబ్బి వారసుల మధ్య నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టులో నడుస్తోంది. – మంత్రి ఫరూక్ సోదరుడు ఎన్‌ఎండీ ఖుద్దూస్, కుమారుడు ఫిరోజ్
రూ.14 కోట్ల విలువైన పనులు నిలిపివేత
నంద్యాలలో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమ్ (పీఎంజేకే) ద్వారా హాస్టల్, స్కూలు భవనాలతో పాటు 6 మేజర్ పనులు రూ.14 కోట్లతో జరుగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఇటీవల ఈ పనులు నిలిపివేయించారు. మంత్రితో మాట్లాడిన తర్వాతే తిరిగి మొదలెట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించడంతో పనులు ఆగిపోయాయి.
షాదీఖానా కమిటీని రాజీనామా చేయించిన వైనం
ఫరూక్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నంద్యాలలో ఎన్‌టీఆర్ షాదీఖానా కమిటీని కూడా బలవంతంగా రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ పదవీ కాలం జూన్ 27తో ముగుస్తుందని చెప్పినప్పటికీ, జూన్ 20నే సభ్యులతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ షాదీఖానాను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రూ.కోటి నిధులతో ఆధునికీకరించారు. ఇప్పుడు తమ అస్మదీయులతో కమిటీ నియమించి షాదీఖానాను గుప్పిట్లో పెట్టుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment