కచోరీలు అమ్ముకుంటున్న భారత క్రికెటర్
వడోదర: అతను భారత్ తరపున క్రికెట్ ఆడి ఎన్నో మధురమైన విజయాలను అందించాడు. దశాబ్ధం క్రితం చెవిటి, మూగ విభాగంలో క్రికెట్ ఆడి...వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఆల్రౌండ్ ప్రదర్శనకు గాను ఇండియా టీం కెప్టెన్గా కూడా నియమించబడ్డాడు. అయితే ఇప్పుడు మాత్రం అతడు... జీవనాధారం కోసం రోడ్డు పక్కన కచోరీలు అమ్ముకుంటున్నాడు. తన బ్యాటింగ్ సామర్థ్యాలతో కీలకమైన అర్థ సెంచరీలు సాధించి డెఫ్ అండ్ డమ్ క్రికెట్ వరల్డ్ కప్ భారత్కు రావడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ ఇమ్రాన్ షేక్.. జీవితం విసిరిన బౌలింగ్లో మాత్రం క్లీన్ బౌల్డయ్యాడు.
ఇమ్రాన్ షేక్ వారం రోజుల క్రితం వడోదరలోని ఓల్డ్ పద్రా రోడ్డులో 'మూంగ్ కచోరీ' స్టాల్ ను ప్రారంభించాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. 'క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం, ఇంకా క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను. కానీ నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కుటుంబానికి అండగా నిలబడటానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. చెవిటి, మూగ విభాగంలో క్రికెట్ ఆడటం వలన సరిపడినంత ఆదాయం సమకూరకపోవడంతో.. భార్య రోజాతో కలిసి న్యూట్రిషనల్ కచోరీ వ్యాపారం ప్రారంభించాను' అని తెలిపాడు. భారత క్రికెట్ ఆటగాళ్లు అంటే సంపాదన విషయంలో వారికేం కొదవ లేదు అనే భావన ఉంది. అయితే ఇది కేవలం కొందరి విషయంలో మాత్రమే అని ఇమ్రాన్ షేక్ ఉదంతం స్పష్టం చేస్తుంది.