మహిళలపై ఇన్ని అఘాయిత్యాలా!
పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల ఆందోళన
రేపిస్టులకు శిక్షగా ‘కెమికల్ క్యాస్ట్రేషనే’ సరి
హింసకు పాల్పడే జువెనైల్స్‌కూ కఠిన శిక్షలు ఉండాలి
న్యూఢిల్లీ: దేశంలో గత కొంతకాలంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు, హింసాత్మక దాడులు పెరిగిపోతుండటంపై గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న సభ్యులంతా పార్టీలకు అతీతంగా ఈ దారుణాలను ముక్తకంఠంతో ఖండించారు. అత్యాచారాలకు పాల్పడే జువెనైల్స్‌ను కూడా వయోజనుల మాదిరే పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో స్త్రీని విలాస వస్తువుగా భావించే మగవారి ఆలోచనా విధానంలో మార్పు రావాలని బీజేపీ మహిళా ఎంపీ బిజోయా చక్రవర్తి అన్నారు.
వరకట్న ఆచారం, భ్రూణ హత్యలు కొనసాగుతున్నంత కాలం మహిళలపై దాడులను నియంత్రించడం సాధ్యం కాదని కాంగ్రెస్ మహిళా ఎంపీ రంజీత్ రంజన్ పేర్కొన్నారు. అక్రమ అబార్షన్లు చేసే వైద్యులను జైళ్లలో పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తిదార్ డిమాండ్ చేశారు. ఈ చర్చలో కొత్తపల్లి గీత, బుట్టా రేణుక (వైఎస్సార్‌సీపీ), మురళీ మోహన్ (టీడీపీ), నగేష్ (టీఆర్‌ఎస్) తదితరులు పాల్గొన్నారు. మరోవైపు రాజ్యసభలో జరిగిన చర్చలో రేపిస్టులకు కెమికల్ క్యాస్ట్రేన్ (రసాయన పద్ధతుల ద్వారా లైంగిక సామర్థ్యం కోల్పోయేలా చేయడం) వంటి తీవ్రమైన శిక్షలను విధించాలని ఎంపీలు కోరారు.