ఎన్ని ప్రత్యేక చట్టాలు తెచ్చినా మహిళలపై వేధింపులు, నేరాల పర్వం కొనసాగుతూనే ఉంది. అందుకు ఇటీవల నేషనల్ క్రైమ్ బ్యూరో వెల్లడించిన నివేదికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గత నాలుగేళ్ళలో మహిళలపై వేధింపులు, అత్యాచారాల కేసులు 34 శాతం పెరిగిపోయినట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది.
ఉత్తర ప్రదేశ్, మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గత నాలుగు సంవత్సరాల్లో మహిళలపై నేరాలు 34 శాతం పెరిగిపోయినట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. ముఖ్యంగా భర్తలు, బంధువుల క్రూరత్వంతోనే మహిళలపై జరుగుతున్న నేరాల కేసులు అధికంగా నమోదవుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం మహిళా జనాభాను బట్టి నిర్వచించగా.. 2012 నుంచి 2015 మధ్య నేరాల రేటు 41.7 నుంచి 53.9 కు చేరినట్లు తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న నేరాలు ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమ్మాయిలపై అత్యాచారాలు, మహిళలపై వేధింపుల్లో ఆ రాష్ట్రం ముందున్నట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి.
ఎన్సీఆర్బీ గణాంకాలనుబట్టి మహిళలపై నేరాల రేటు పెరిగినట్లు తెలుస్తున్నా... మహిళల్లో పెరిగిన ఆత్మవిశాసంతోనే వారిపై జరిగే నేరాలను ధైర్యంగా వెల్లడిస్తున్నారని, దీంతో అధిక కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2015లో భర్త, బంధువుల క్రూరత్వంపై 34 శాతం కేసులు నమోదవ్వగా గత నాలుగేళ్ళతో పోలిస్తే 6 శాతం వృద్ధి చెంది, 2012 లో 106,527 గా ఉన్న సంఖ్య 2015 నాటికి 113,403 కి చేరుకుంది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ 2015 ప్రకారం 2012 నుంచి నమోదైన డేటాను.. మహిళా జనాభా ఆధారంగా విభజించి నేరాల సంఖ్యను లెక్కించి తాజా నివేదికల్లో పేర్కొన్నారు. అయితే మహిళలు మౌనంగా బాధను భరించడాన్ని నిరాకరిస్తుండటంతోనే కేసుల సంఖ్య పెరిగుతున్నట్లు ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి వర్షా శర్మ అక్టోబర్ 2014 లో ఓ నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలపై నేరాలు 2015 లో ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధికంగా నమోదైనట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తర్వాత రాజస్థాన్ అత్యధిక నేరాల చిట్టాల్లో అత్యధిక స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.
మహిళలపై 34 శాతం పెరిగిన నేరాల సంఖ్య
Published Tue, Sep 6 2016 9:55 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement