దండిగా వర్షాలు పడ్డాయి. వీధులు చెరువులుగా మారాయి. భారీ వర్షాలతో గుజరాత్‌లోని వడోదరా పట్టణం ఇప్పుడు అతలాకుతలం అవుతోంది. వీధుల్లో వరదనీరు వచ్చి చేరడంతో పట్టణంలోని చాలా వీధులు చెరువుల్ని తలపిస్తున్నాయి. చుట్టూ చేరిన నీరుతో బయటకు వెళ్లలేక పట్టణవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికితోడు వరద నీళ్లో మొసళ్లు తిష్టవేశాయి. వరదనీటిలో ఎక్కడ చూసినా మొసళ్లు తిరుగుతున్నాయి. దీంతో గుండెల్ని అరచేత పట్టుకొని.. వడోదరా వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
వడోదర వీధుల్లోని వరదనీటిలో మొసళ్లు తిష్టవేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియోలో వరదనీటిలో మొసలి వేట భయంగొలిపే రీతిలో ఉంది. వరదనీటిలో చేరిన మొసలి.. వరదలో బిక్కుబిక్కమంటూ ఉన్న ఓ కుక్కను మింగేయాలని చూసింది. కుక్కకు ఏమాత్రం అనుమానం కలుగకుండా మెల్లగా దానిని అనుసరిస్తూ.. దగ్గరగా వెళ్లి.. అమాంతం దాడి చేసేందుకు మొసలి ప్రయత్నించింది. అయితే, అప్రమత్తంగా ఉన్న కుక్క వెంటనే పక్కకు తొలగడంతో దాడి నుంచి తప్పించుకుంది. అక్కడే మరో కుక్క బిక్కుబిక్కుమంటూ ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment