
ముకేశ్ అంబానీ నివాసం
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కమాండో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అంబానీ సెక్యూరిటీ కోసం నియమించిన ఆయన అనూహ్యంగా శవమై తేలారు. దక్షిణ ముంబైలోని వ్యాపారవేత్త విలాసవంతమైన ‘ఆంటాలియా’ నివాసంలో కానిస్టేబుల్ బొతారా డి రాంభాయ్ తుపాకీతో తనని తాను కాల్చుకుని బుధవారం రాత్రి చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేక అతని చేతిలోని ఆయుధం ప్రమాదవశాత్తూ పేలి చనిపోయాడా అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నామన్నారు.
మృతుడిని గుజరాత్‌లోని జునాగడ్ జిల్లాకు చెందిన రాంభాయ్‌గా గుర్తించారు. అతను 2014లో సీఆర్‌పీఎఫ్‌లో చేరాడు. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా అంబానీకి 'జెడ్ +' కేటగిరీ కింద సెక్యూరిటీ కల్పిస్తోంది సీఆర్‌పీఎఫ్. అంబానీ భార్య నీతా అంబానీకి కూడా 'వై' కేటగిరీ కల్పిస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ముకేశ్ అంబానీ సెక్యూరిటీ బృందంలో రాంభాయ్‌ని సీఆర్‌పీఎఫ్ నియమించింది. అయితే అనూహ్యంగా రాంభాయ్ శవంగా మారడం ఆందోళన రేపింది. అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తి సమాచారం అందాల్సి వుంది.
Comments
Please login to add a commentAdd a comment