
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: పుల్వామా ఉగ్రదాడిలో 43మంది సీఆర్‌పీఎఫ్ జవానుల మృతిపై దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతవరణం కొనసాగుతుండగానే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అమర జవాను భార్యను టార్గెట్ చేసిన ఓ దుర్మార్గుడు ప్రభుత్వం ఆమెకిచ్చిన పరిహార సొమ్మును కాజేశాడు. మధ్య ప్రదేశ్‌లోని సెహోర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 2013 శ్రీనగర్‌లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో మధ్యప్రదేశ్‌కు సీఆర్‌పీఎఫ్ జవాను ఓం ప్రకాశ్ మారదానియా అసువులు బాసారు. అయితే ఆయన భార్య కమల్ బాయికి ప్రభుత్వం రూ.8లక్షలను ఇచ్చింది. ఈ విషయాన్ని గమనించిన మిశ్రీలాల్ మీనా అనే వ్యక్తి కమలా బాయిని ఈ నెల (ఫిబ్రవరి) 11న కలిశాడు. తను సీఆర్‌పీఎఫ్‌కి చెందిన వ్యక్తినని, అమర జవానుల కుటుంబ సంక్షేమ సమాచారం నిమిత్తం ప్రభుత్వం తనను పంపించిందని చెప్పాడు. అలాగే ప్రభుత్వం మరో 34లక్షల రూపాయలను మంజూరు చేసిందని, ఇందుకు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన 8లక్షల రూపాయలను బ్యాంకునుంచి విత్‌డ్రా చేయాలని ఆమెను నమ్మించాడు. అతని మాటల్ని విశ్వసించిన కమలా బాయి ఆ డబ్బులను విత్ డ్రా చేసి వాడికి ఇచ్చింది. అంతే ఇదే అదనుగా భావించిన అతగాడు అక్కడ్నుంచి ఉడాయించాడు.
మరోవైపు కమలా బాయి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ప్రతి మూడునెలలకు ఒకసారి అమర జవానుల కుటుంబాన్ని సీఆర్‌పీఎఫ్ పరామర్శింస్తుందన్న విషయం తెలిసిన వ్యక్తే ఈ నేరానికి పాల్పడి వుంటారని భావిస్తున్నామన్నారు. ఈ కేసు విచారణలో అటు సీఆర్‌పీఎఫ్ కూడా తమతో సహకరిస్తోందని సెహోర్ అదనపు ఎస్‌పీ సమీర్ యాదవ్ వెల్లడించారు.