జమ్ములో కొనసాగుతోన్న కర్ఫ్యూ..
సిక్కు యువకులు, పోలీసులకు మధ్య ఘర్షణల నేపథ్యంలో జమ్ములో విధించిన కర్ఫ్యూ శుక్రవారం కూడా కొనసాగుతున్నది. దీంతో జమ్ము రీజియన్ లోని ఐదు జిల్లాల్లో జననీవనం పూర్తిగా స్తంభించింది. సత్వారీ, మిరియాన్ షబీబ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంతవరకు కర్య్పూ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. 144 సెక్షన్ ను అనుసరించి జమ్ము నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిందిగా జమ్ము జిల్లా కలెక్టర్ సిమ్రన్ దీప్ సింగ్ ఆదేశాలు జారేచేశారు.
కాగా, గురువారం పోలీసులతో జరిగిన తోపులాటలో ఆందోళనకారులు.. ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ నుంచి ఏకే 47 తుపాకిని లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనను సీరియర్ గా తీసుకున్న పోలీసులు ఆర్మీ సహాయంతో నిందితుల కోసం గాలిస్తోంది. సత్వారీ జిల్లాలోని గఢీగఢ్ లో బుధవారం సిక్కు యువకులు ఆందోళనలు నిర్వహించారు. వీరిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా.. జగ్జిత్ సింగ్ అనే యువకుడు మరణించారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు హింసాయుత కార్యక్రమాలకు దిగారు. ఈ అల్లర్లను అదుపుచేసేందుకు జమ్ము వ్యాప్తంగా గురువారం నుంచి కర్ప్యూ అమలవుతున్నది.