ఆ డబ్బు మోదీజీ వేశారనుకున్నా..! | Curious Case Faced By SBI bank With Two Persons In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

విడ్డూరం: ఒకే అకౌంట్‌.. ఇద్దరు వ్యక్తులు..

Published Fri, Nov 22 2019 6:36 PM | Last Updated on Fri, Nov 22 2019 8:12 PM

Curious Case Faced By SBI bank With Two Persons In Madhya Pradesh - Sakshi

భోపాల్‌ : విదేశాల నుంచి బ్లాక్‌ మనీని రప్పించి దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ తన మాట నిలబెట్టుకున్నారని హుకుం సింగ్‌ అనుకున్నాడు. తన ఖాతాలో నెలనెలా వచ్చిపడుతున్న డబ్బులు మోదీజీయే ఇస్తున్నారని దర్జాగా ఖర్చు చేసుకున్నాడు. తీరా చూస్తే.. అవి తన పేరుతోనే ఉన్న మరొకరివని, బ్యాంకు అధికారుల పొరపాటుతో తన ఖాతాలోకి వచ్చిన సొమ్ము అని తేలడంతో అవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..  ఆన్‌లైన్‌ లావాదేవిల్లో తరచూ అవకతవకలు జరగడం రోజూ చూస్తునే ఉన్నాం..  అకస్మాత్తుగా అకౌంట్ల నుంచి డబ్బులు మాయమవడం.. అనుకోకుండా డబ్బులు జమ అవ్వడం సర్వసాధారణమైన విషయంగా మారింది. తాజాగా ఇలాంటి  సంఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బింద్‌ జిల్లా రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్‌ ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్లాడు. అక్కడ తను సంపాదించిన మొత్తాన్ని  స్టేట్‌ బ్యాంక్‌  ఆఫ్‌ ఇండియాలో జమ చేయడం ప్రారంభించాడు. ఇలా  ఆరు నెలల్లో మొత్తం రూ. 140,000 వేలు జమచేశాడు. అనంతరం ఊరికి తిరిగి వచ్చిన సదరు వ్యక్తికి డబ్బులు విత్‌ డ్రా చేద్ధామని ప్రయత్నించగా అకౌంట్‌లో కేవలం రూ. 35,400 ఉన్నట్లు కనిపించడంతో కంగుతిన్నాడు. వెంటనే బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. 

దీనిపై బ్యాంకు అధికారులు విచారించగా.. ఒకే అకౌంట్‌ నెంబర్‌పై రెండు అకౌంట్‌లు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో హుకుం సింగ్‌(రురై గ్రామం).. హుకుం సింగ్‌ (రోనీ గ్రామం). ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇద్దరు ఒకే బ్రాంచ్‌ ఆలంపూర్‌లో అకౌంట్‌ తీయడంతోపాటు ఇద్దరు పేర్లు కుడా ఒకటే అవ్వడంతో కంగారుపడ్డ బ్యాంకు మేనేజర్‌ ఇద్దరికి ఒకే అకౌంట్‌ నెంబర్‌ కేటాయించాడు. ఇక రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్‌ ఖాతాలో వేసిన డబ్బులు..రోనీ గ్రామానికి చెందిన హుకుం సింగ్‌ విత్‌ డ్రా చేశాడని  నిర్ధారణకు వచ్చిన బ్యాంకు అదికారులు ఈ తప్పిదమంతా బ్యాంకు మేనేజర్‌ రాజేష్‌ సోంకర్‌ వల్లే జరిగిందని అంగీకరించారు. అనంతరం అతడిని పిలిచి బ్యాంకు అధికారులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

ఎన్నికల సమయంలో నల్లధనాన్నివెనక్కి తీసుకు వచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తానని అప్పట్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ప్రస్తుతం తమ అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నారని అనుకున్నానని సదరు వ్యక్తి తెలిపాడు. అందుకే ప్రతి నెల అకౌంట్లో వచ్చిన డబ్బులను తీసుకున్నానని, అవి తనకు చాలా అవసరమయ్యాయని వెల్లడించాడు. ఆరు నెలల్లో దాదాపు రూ.89,000 వేలు విత్‌డ్రా చేశానని అధికారుల ముందు ఒప్పుకున్నాడు. చివరికి వాస్తవం తెలుసుకున్న హుకుం సింగ్‌ నిరాశపడ్డాడు. అయితే తమ తప్పిదాన్ని అంగీకరించిన బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ప్రయత్నించారని బాధితుడు ఆరోపించాడు. ఇక ఈ సమస్యను బ్యాంకు అదికారులు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి!..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement