నాటి ప్రేమికుల కలకలం నేడెక్కడ?
న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దు పెళ్లిళ్లపైనే కాదు ప్రేమికులపై కూడా ప్రభావం చూపిస్తోంది. నగరాల్లోని పార్కుల్లో ప్రేమికుల రాక తగ్గిపోయి బెంచీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. పల్లి, బఠాణీలు అమ్మేవారికి బోణీలేక పార్కుల్లో దీనంగా కూర్చుంటే, ఐస్‌క్రీమ్, టీబండ్లు నడిపేవారు రోడ్లపక్కనా దిగులుగా దిక్కులు చూస్తున్నారు. ఎప్పుడు కాలేజీ అమ్మాయిలతో, అబ్బాయిలతో కలర్ ఫుల్‌గా కనిపించే కాఫీ హౌజ్‌లు కలకలం తగ్గి వెలవెల బోతున్నాయి.
మల్లీప్లెక్స్ థియేటర్లు కూడా యువతీ యువకుల కోలాహలం తగ్గి కూనిరాగాలు తీస్తున్నాయి. ఆ పక్కనే పాప్‌కార్న్ బిజినెస్ పడిపోయిన యువకుడి ముఖంలో విషాధ చిత్రం చూస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. మరోపక్క ఘుమఘుమలాడే బిర్యాని తింటే కమ్మని కాఫీతోపాటు చల్లటి కోన్‌ను ఉచితంగా ఇస్తామంటూ రిస్టారెంట్ వాళ్లు రా, రమ్మని పిలుస్తున్నా పలికేవాళ్లు లేరు. ఇంకోపక్క పిడుగుల్లాంటి పిల్లల అల్లరితో ఎప్పుడూ సందడిగా కనిపించే వీడియో గేమ్స్ కూడా మూగబోయాయి.
నోట్ల కష్టాలు మొదలవక ముందుదాకా ఆకాశంలో నెలరేడు పక్కన నక్కిన చుక్కలను లెక్కించిన ప్రేమికులు... ఇదివరకటిలా రోజు కలసుకోకపోయినా అప్పుడప్పుడు కలసుకొని కొత్త నోట్లను ఎంత పొదుపుగా వాడాలో లెక్కిలేసుకుంటున్నారు. అనువైన ఏటీఎంల వద్ద కలుసుకునేందుకు సందేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. క్యూలో ఒకరి కోసం ఒకరు నిలబడాలని కూడా బాస చేసుకుంటున్నారు. బర్గర్లు, పిజ్జాల స్థానంలో సమోసాలు, బజ్జీలతో బొజ్జలు నింపుకుంటున్నారు. కాఫీకి సెలవిచ్చి టీలను అరువు తీసుకుంటున్నారు.
కారులో షికార్లు కొట్టే హైటెక్ ప్రేమికులు మాత్రం పాత నోట్లతో కూడా పండుగ చేసుకుంటున్నారు. పాత నోట్లను తీసుకుంటామంటూ స్పెషల్ ఆఫర్లు ఇస్తుండడంతో పబ్బులు, గిబ్బులని గోల చేస్తున్నారు. వారి త్రీస్టార్, ఫైవ్ స్టార్ జల్సాలకు, జాయ్ రైడ్లకు కొదవ లేకుండా పోయింది. ఇక రకరకాలు కార్డులతో రంగుల ప్రపంచంలో విహరించే ప్రేమికులకు నోట్లు పాతవైతేనీమీ, కొత్తవైతేనేమి.
(సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యల ఆధారంగా ఈ కథనం)