పాట్నా: ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు చూసి ప్రజలు షాకైన ఘటన శనివారం బీహార్‌లో చోటుచేసుకుంది. వాటిని తీసుకోకపోతే మిమ్మల్ని నాశనం చేస్తానంటూ హెచ్చరిస్తూ ఓ చీటీ దొరకడం కలకలం రేపుతోంది. వివరాలు.. కోవిడ్-19 (కరోనా వైరస్)తో ప్రజలు బయటకు రావడానికే బిక్కుబిక్కుమంటున్నారు. ఈ క్రమంలో బీహార్‌లోని సహర్స పట్టణంలో కొంతమంది దుండగులు ఇళ్ల ముందు రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను చల్లారు. వీటితోపాటు ఓ చీటి కూడా వదిలి వెళ్లారు. దీనిలో "నేను కరోనాతో వచ్చాను. నన్ను స్వీకరించండి. లేకపోతే మీ అందరినీ వేధిస్తాను" అని రాసి ఉంది. (కరోనా మరణాలకు.. రూ. 4 లక్షల పరిహారం)
ఇలాంటి కరెన్సీలు ఇతర ప్రాంతాల్లో కూడా దర్శనమిచ్చాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు పోలీసులకు సమాచారమందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రజలను భయపెట్టేందుకు ఎవరో ఆకతాయి ఇలాంటి పని చేసినట్లు భావిస్తున్నామని వారు తెలిపారు. దీనిపై ఓ స్థానికుడు మాట్లాడుతూ.. "పొద్దుపొద్దునే ఇంటిముందు నోట్లు దర్శనమిచ్చాయి. అయితే తొలుత దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇలాంటి ఘటనలు చాలాచోట్ల జరుగుతుండటంతో పోలీసులను ఆశ్రయించా"మని తెలిపాడు. ఇదిలావుండగా కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఇప్పటివరకు ఏ పరిశోధనల్లోనూ తేలలేదు (కరోనా అంటూ కొట్టిచంపారు)
Comments
Please login to add a commentAdd a comment