చెన్నైలోని కాశిమేడు హార్బర్ వద్ద ఎగసిపడుతున్న సముద్ర అలలు
సాక్షి, విశాఖపట్నం/కోల్‌కతా/భువనేశ్వర్: ఉంపన్ తుపాను మంగళవారం బలహీనపడి, అత్యంత తీవ్ర తుపానుగా మారింది. అయినా, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసం సృష్టించే స్థాయిలోనే ఉంది. దాంతో, ఆ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. తుపాను ప్రభావం ఉండే తీర ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.‘కోల్‌కతాకు దక్షిణంగా 180 కి.మీల దూరంలో ఉన్న దిఘాకు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవికి మధ్య బుధవారం మధ్యాహ్నానికి తుపాను తీరం దాటొచ్చు. ఆ సమయంలో తీరం వెంబడి పెనుగాలుల వేగం 165 కి.మీల వరకు ఉండొచ్చు’ అని భువనేశ్వర్‌లోని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు.
సహాయక చర్యలు
పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్)కు చెందిన 41 బృందాలను మోహరించామని ఎన్‌డీఆర్‌ఎఫ్ చీఫ్ ఎస్‌ఎన్ ప్రధాన్ తెలిపారు. బెంగాల్ తీర ప్రాంతాల నుంచి సుమారు 3 లక్షల మందిని తుపాను సహాయ కేంద్రాలకు తరలించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. గత సంవత్సరం ఫని, బుల్‌బుల్ తుపానులను ఎదుర్కొన్న అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతోందని విపత్తు నిర్వహణ మంత్రి జావేద్ పేర్కొన్నారు.
ఒడిశాలో..
తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లోని 11 లక్షల మందిని తరలించే కార్యక్రమం ప్రారంభించామని ఒడిశా అధికారులు తెలిపారు. ప్రభావిత జిల్లాలో విపత్తు నిర్వహణ దళాలు సహాయ సామగ్రితో సిద్ధంగా ఉన్నాయన్నారు. కేంద్రపార, బాలాసోర్ తదితర తీర ప్రాంత జిల్లాల్లో పెనుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశముంది. ఉంపన్ తుపాను సహాయ చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ సీఎం మమత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో వేర్వేరుగా సమీక్షించారు. అత్యంత తీవ్ర(ఎక్స్‌ట్రీమ్లీ సివియర్) తుపాను నుంచి సోమవారం ప్రచండ తుపాను(సూపర్ సైక్లోన్)గా ఉంపన్ పరిణమించింది. మంగళవారం బలహీనపడి అత్యంత తీవ్ర తుపానుగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment