గాంధీనగర్ : తుపాను ‘వాయు’ ఉత్తర భారతం వైపు చురుకుగా కదులుతోంది. జూన్ 13 నాటికి గుజరాత్‌లోని పోరబందర్ ముహువాల మధ్య తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ముందు జాగ్రత్తగా చర్యగా అధికారులు జూన్ 13న పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇక తీరాన్ని తాకిన రెండ్రోజుల తర్వాత గుజరాత్‌లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అంటే గురువారం నాటికి తీవ్రరూపం దాలుస్తుందని అధికారులు చెప్పారు.
లక్ష్వద్వీప్‌లోని అమినిదీవిలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రానున్న 48 గంటల్లో ఇది బలపడుతుందని చెప్పారు. ఫలితంగా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మూడు రోజుల పాటు పర్యాటకులు ఎవరూ గుజరాత్ రావద్దని.. ప్రస్తుతం ఉన్న వారు పర్యటనకు వెళ్లవద్దని కోరారు. వాయు తుపాను కారణంగా గుజరాత్‌లో భారీవర్షాలు కురుస్తాయన్న సమాచారంతో ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది.
ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీర ప్రాంతంలో మోహరించాయి. సౌరాష్ట్ర కచ్ తీరంలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఇప్పటికే మోహరించి ఉన్నాయి. ఇక తీరప్రాంతం వెంబడి ఆర్మీ, నేవీ బలగాలతో పాటు కోస్ట్ గార్డ్ కూడా అలర్ట్‌గా ఉంటారని ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment