పోరాట దీప్తి.. దల్బీర్ కౌర్
చండీగఢ్: దల్బీర్ కౌర్...ఆమె పేరు వినగానే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రెండు దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటం, తమ్ముడి విముక్తి కోసం సాగించిన పదివేల కిలోమీటర్ల ప్రయాణం గుర్తొస్తాయి. వేలాది కొవ్వొత్తుల ప్రదర్శనలు, వందలాది ర్యాలీలు కళ్ల ముందు మెదలుతాయి. ఇరు దేశాల మధ్య 170 మంది రాజకీయ నేతలను కలుసుకున్న సందర్భాలు స్మృతికొస్తాయి.
దల్బీర్ కౌర్ తన తమ్ముడి కోసం 23 ఏళ్లపాటు సాగించిన పోరాటంలో ఆమె ఏనాడు అలసిపోలేదు. ప్రతి రోజూ నిత్య పోరాట స్ఫూర్తితోనే నిద్ర లేచారు. ఆ తర్వాత ప్రతి క్షణం తన తమ్ముడిని కలుసుకోవాలని, విడదల కోసం కృషి చేయాలని ఆరాటపడ్డారు. తన తమ్ముడు ఏ జైలులో ఉన్నాడో తెలుసుకోవడంతోపాటు భారత్ పాస్‌పోర్ట్, పాక్ వీసా సాధించడం, జైల్లో తమ్ముడిని కలుసుకోవడం వరకు ఏనాడు నిరాశా నిస్పృహలకు గురికాలేదు. కడుపులో పుట్టిన కన్న బిడ్డకన్నా కడుపు పంచుకొని పుట్టిన తమ్ముడు సరబ్‌జిత్ కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది.
దల్బీర్ కౌర్‌ది అమృత్సర్‌కు సమీపంలోని భికివిండ్ అనే కుగ్రామం. తమ్ముడు సరబ్‌జిత్ పొరపాటున దేశ సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించారు. తాము వెతుకుతున్న మరెవరో భారత గూఢచారి అనుకొని 1990, ఆగస్టు 28వ తేదీన సరబ్‌ను పాకిస్తాన్ సైనికులు అరెస్టు చేశారు. గూఢచర్యం అభియోగాలపై కేసును విచారించిన పాక్ కోర్టు 1991లో ఉరిశిక్ష విధించి జైల్లో నిర్బంధించింది. తమ్ముడి జాడ కోసం వెతుకుతున్న దల్బీర్ కౌర్‌కు ఈ విషయం తెల్సింది. అప్పటి నుంచి ఆమె తమ్ముడి విడుదల కోసం భారత అధికారుల మీద ఒత్తిడి తీసుకరావడం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నుంచి ప్రధాన మంత్రుల వరకు ఆమె ఎవరిని వదిలి పెట్టలేదు. ఎవరు అనుమతి ఇచ్చినా లేకపోయినా గేట్లు దూసుకుపోయారు.
1991లో ఆమె అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు దాదాపు వంద సార్లు ఫోన్ చేశారు. ఈ బెడద తట్టుకోలేక పీవీ ఆమెను పిలిపించారు. ‘చింతా మత్ కరో హమ్ తుమారే భాయ్ కో లే ఆయెంగే (బాధ పడకు మీ తమ్ముడిని మేము తీసుకొస్తాం)’ అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆమె ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా కలుసుకున్నారు. మన్మోహన్ సిఫారసుపై అప్పటి పాక్ అధినేత ముషార్రఫ్‌ను కులుసుకున్నారు. అప్పటికీ సరబ్‌జిత్‌కు ఉరిశిక్షను అమలు చేయకపోవడంతో ఉరిశిక్షను నిలిపివేయిస్తానంటూ ముషార్రఫ్ హామీ ఇచ్చారు. మాజీ క్రికెటర్ నవజోతి సింగ్ సిద్ధూను కూడా ఆమె కలుసుకున్నారు. తమ్ముడి కోసం పోరాటం జరపుతున్న ఇలాంటి అక్కను తానెన్నడూ చూడలేదని ఆ సందర్భంగా సిద్ధు వ్యాఖ్యానించారు.
లాహోర్‌లోని కోట్ లోక్‌పత్ జైల్లో ఉన్న సరబ్‌జిత్‌ను కలుసుకునేందుకు 2011లో దల్బీర్ కౌర్‌కు అవకాశం దొరికింది. ఈ సందర్భంగా ఆమె తమ్ముడికి రాఖీ కట్టి ఎలాగైనా ‘నిన్ను విడిపించుకుంటానురా తుమ్ముడూ!’ అంటూ శపథం చేశారు. ఆ సందర్భంగా తమ్ముడి కళ్ల నుంచి పెళ్లుబికిన కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయానని ఆమె ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇటు భారత్ నేతలు, అటు పాక్ నేతలు ఎన్ని హామీలు ఇచ్చినా సరబ్‌జిత్ విడుదల కాలేదు.
2013, ఏప్రిల్ 26వ తేదీన సరబ్‌జిత్‌ను తోటి ఖైదీలు చంపేశారు. సరబ్‌జిత్‌ను విడుదల చేస్తే ఓ అమాయకుడిని అన్యాయంగా అరెస్టుచేసి శిక్ష విధించారనే ఆరోపణలను నిజం చేసినట్లవుతుందనే ఉద్దేశంతో పాక్ సైనిక శక్తులే సరబ్‌జిత్ హత్యకు కుట్రపన్నాయనే విమర్శలు వచ్చాయి. సరబ్‌కు సజీవంగా స్వాగతం చెబుతామని సొంతూరులో నిరీక్షిస్తున్న దల్బీర్ కౌర్ ఇంటికి తమ్ముడి శవం చేరింది. తమ్ముడికి ఘనంగా దహన సంస్కారాలు చేసిన దల్బీర్ కళ్లల్లో నీళ్లింకిపోయినా పోరాట స్ఫూర్తి మాత్రం అలాగే మిగిలిపోయింది.
(దల్బీర్ కౌర్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిర్మించిన బాలివుడ్ చిత్రమే ‘సరబ్‌జిత్’. దల్బీర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించిన ఈ చిత్రం మే 20వ తేదీన విడుదలవుతోంది.)