ఇస్లామాబాద్ : భారత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్‌ను జైలులో చంపిన పాకిస్తాన్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ హత్యకు గురయ్యాడు. ఆదివారం లాహోర్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అమీర్ సర్ఫరాజ్‌ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది.
సరబ్‌జీత్ సింగ్ ఎవరు?
సరబ్‌జీత్ సింగ్ భారత్, పాకిస్థాన్ సరిహద్దులోని భిఖివిండ్ గ్రామానికి చెందిన రైతు. 1991లో పొరపాటుగా సరిహద్దును దాటి పాక్‌లోకి ప్రవేశించారు. దీంతో గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసిన పాకిస్థాన్.. ఆయనకు మరణశిక్ష విధించింది.
సరబ్‌జీత్ సింగ్‌పై దాడి చేసిన పాక్ డాన్
అనంతరం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో సరబ్‌జీత్ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, 2013లో భారత్‌లో పార్లమెంట్ దాడికి పాల్పడిన అప్జల్ గురుని ఉరితీసిన కొన్ని రోజుల తర్వాత లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్న పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ డాన్ అమీర్ సర్ఫరాజ్ సహా ఇతర ఖైదీలు సరబ్‌జీత్‌పై దారుణంగా దాడి చేశారు. ఖైదీలు ఇటుకలతో సరబ్‌జీత్‌పై దాడి చేయడంతో అతని మెదడులో తీవ్రగాయాలై, చికిత్స పొందుతూ జిన్నా ఆస్పత్రిలో మరణించారు. కాగా, సరబ్‌జీత్ 23 ఏళ్లు లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలు శిక్షను అనుభవించారు.
దల్బీర్ కౌర్ 22 ఏళ్ల పాటు న్యాయ పోరాటం
సరబ్‌జీత్ సింగ్ నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆతని సోదరి దల్బీర్‌కౌర్ సుదీర్ఘ కాలం పోరాటం చేశారు. తన సోదరుడు పొరపాటున సరిహద్దు దాటారని.. ఆయనను విడుదల చేయాలంటూ దల్బీర్ 22 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. సరబ్‌జీత్‌ను చూసేందుకు పాకిస్థాన్ సైతం వెళ్లివచ్చారు. దల్బీర్‌కౌర్ గత ఏడాది ఛాతీ నొప్పితో పంజాబ్ అమృత్‌సర్‌కు చెందన ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
‘సరబ్‌జీత్’ పేరుతో బయోపిక్
సరబ్‌జీత్ సింగ్, దల్బీర్‌కౌర్ జీవితాల ఆధారంగా బాలీవుడ్‌లో ‘సరబ్‌జీత్’ బయోపిక్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్ దల్బీర్ పాత్రలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment