చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి..
ఆగ్రా: ఓ గేదెను దొంగిలించాడనే అనుమానంతో కొంతమంది అగ్రకులస్థులు దళిత యువకుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ అనే గ్రామంలో చోటుచేసుకుంది.తమ గేదెను దొంగిలించారనే అనుమానంతో ఓ 15మంది అగ్రకులస్తులు ఈ పనిచేసినట్లు బాధితుడి తల్లిదండ్రులు చెప్పారు.
'మా కొడుకు గేదెను దొంగిలించాడనే అనుమానంతో ఇంటికొచ్చిన 15మంది పెద్ద కులపోల్లు ఇంట్లో ఉన్న నా కొడుకును ఈడ్చుకెళ్లారు. మా వాడు ఆ దొంగతనం చేయలేదు. అయినా, మా కొడుకును చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగా బట్టలు విప్పేసి దారుణంగా హింసించారు. వాడి మార్మాంగాలపై పెట్రోల్ పోయడమే కాకుండా మత్తు సూదులు కూడా వేశారు' అంటూ ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.