వివాహం నిశ్చయమైన దళిత యువకుడు సంతోష్ కుమార్
లక్నో : ప్రతి మనిషి జీవితంలో వివాహం ఒక ముఖ్య ఘట్టం. ఆ వివాహ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. యూపీకి చెందిన ఓ యువకుడు కూడా అలానే అనుకున్నాడు. వివాహనంతరం బరాత్(పెళ్లి ఊరేగింపు) నిర్వహించాలనుకున్నాడు. అందుకోసం అనుమతివ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించాడు. అదేంటి బరాత్ వేడుక నిర్వహించడానికి కోర్టు అనుమతి ఎందుకు, ఈ కొత్త నిబంధన ఎప్పుడు పెట్టారు అనుకుంటున్నారా..? ఈ సంఘటన జరిగింది మన దగ్గర కాదులెండి ఉత్తరప్రదేశ్‌లో. వివాహం చేసుకోబేబొయే వ్యక్తి దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో బరాత్ నిర్వహణకు అనుమతించాల్సిందిగా కోర్టును వేడుకున్నాడు. వినడానికి విడ్డూరంగా అనిపించే ఈ సంఘటన లక్నోలోని కస్గంజ్ గ్రామంలో చోటుచేసుకుంది.
కస్గంజ్ గ్రామానికి చెందిన సంజయ్ కుమార్‌కు వివాహం నిశ్చయం అయింది. తన వివాహ వేడుకలో సంజయ్ బరాత్ నిర్వహించలనుకున్నాడు. కానీ అందుకు గ్రామంలోని ఉన్నత సామాజిక వర్గానికి చెందిన ఠాకుర్‌లు ఒప్పుకోలేదు. ‘దళితులు ఊరి మధ్యలో నుంచి వెళ్లడం సంప్రాదాయనికి విరుద్ధం. మా మాట కాదని మీరు బరాత్ తీస్తే తర్వాత చాలా తీవ్ర పరిణామాలు చూడాల్సివస్తుందని’ హెచ్చరించారు. కావాలంటే మీరు ఊరి బయట ఉన్న మైదానంలో వివాహ వేడుకలు జరుపుకుని, అక్కడ నుంచే ఊరేగింపు నిర్వహించుకోవచ్చని సలహా ఇచ్చారు. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమని, మీ వాదనను ఎవరూ పట్టించుకోరని ఠాకూర్‌లు అనటంతో... ఈ అంశం గురించి ఇరువర్గాల మధ్య ఒక నెల నుంచి గొడవ జరుగుతూనే ఉంది. దీంతో విసిగిపోయిన సంజయ్ ఈ అంశం మీద డిస్ట్రిక్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. డిస్ట్రిక్ట్ కోర్టు వధువు మైనర్ కాబట్టి, మరో రెండు నెలల తర్వాత మేజర్ అవుతుందని, అప్పటి వరకూ ఈ విషయం గురించి తీర్పు చెప్పలేమని తెలిపింది.
అయితే కోర్టులో ఫిర్యాదు చేయాడానికంటే ముందే సంజయ్ కుమార్ ఈ విషయం గురించి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు... ఆయన పోర్టల్ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు, పలుదఫాలు పోలీసుస్టేషన్‌కు కూడా వెళ్లాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు ఈ విషయాన్ని స్థానిక పోలీసుల వద్ద పరిష్కరించుకోవాలంటూ అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయం గురించి సంజయ్ మాట్లడుతూ ‘నేను కోర్టు తీర్పును గౌరవిస్తాను.
అయితే ఒకసారి రికార్డులను పరిశీలించాల్సిందిగా నేను కోర్టు వారిని కోరుతున్నాను. ఒక వేళ వధువు మైనారిటీ తీరలేదనే విషయం వాస్తవం అయితే నేను రెండు నెలలు ఆగుతాను. కానీ బరాత్ విషయంలో మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు’ అని చెప్పాడు. ఇదిలా ఉండగా గ్రామ పెద్ద ఓమ్ ప్రకాశ్ ఠాకుర్ మాట్లాడుతూ బరాత్ పేరుతో సంజయ్ అల్లర్లు సృష్టించాలనుకుంటున్నాడని, అందుకే ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. వివాహ వేదిక నుంచి తన ఇంటి వరకూ అతను ఊరేగింపు నిర్వహించుకుంటే సమస్యే లేదని, అయితే సంప్రదాయాన్ని కాదని దళితులు ఊరంతా తిరుగుతామంటే కుదరదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment