మైసూరు: అంగరంగ వైభవంగా జరిగే మైసూరు ఉత్సవాల్లో గజేంద్రుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తుందనే విషయం అందరికి తెల్సిందే. అయితే అశేష జనసందోహం, పిల్లల కేరింతల మధ్య ఏనుగులు మావటీలు చెప్పిన మాటవిని బుద్ధిగా నడుచుకోవడం మామూలు విషయం కాదు. వాటికి ఎంతో క్రమశిక్షణ నేర్పుతారు. గత 20 ఏళ్లుగా శ్రీరామ, గజేంద్ర అనే పేర్లుగల రెండు ఏనుగులు దసరా ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 60 ఏళ్ల గజేంద్రుడు, 59 ఏళ్ల శ్రీరామా ఎప్పుడూ కలిసిమెలసి ఆప్యాయంగానే ఉంటాయి. గత ఆదివారం నాడు ఏమైందోగానీ గజేంద్రుడికి తిక్కరేగి గణపతి అనే మావటి సహాయకుడిని చంపడమే కాకుండా అన్నేళ్లుగా తోడుగా వుంటున్న శ్రీరామాను కూడా వెంటాడి వెంటాడి చంపేసింది. ఆ తర్వాత సమీపంలోని అడవిలోకి పారిపోయింది. రంగనాథస్వామి ఆలయానికి చెందిన జంతుసంరక్షణశాలలో చోటుచేసుకున్న ఈ హఠాత్పరిణామం పట్ల ఇటు ఆలయ నిర్వాహకులు, అటు సంరక్షణ కేంద్రం అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక అడవుల పొలిమేరల్లో, ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో అటవి ఏనుగులు బీభత్సం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పలు సందర్భాల్లో వాటిని దారిలో తీసుకరావడానికి శ్రీరామా ఏనుగు ఎంతో తోడ్పడిందని ఫారెస్ట్ అధికారి నాగరాజ్ తెలిపారు. ఇంతవరకు దాదాపు 75 అటవి ఏనుగులను మచ్చిక చేసుకొని దారిలోకి తీసుకరావడానికి తోడ్పడిన శ్రీరామా మిత్రుడి చేతిలోనే చనిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇంతకాలం రంగనాథ ఆలయ గజపతిగా సేవలందించిన శ్రీరామాకు సోమవారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. గజేంద్రుడి అనూహ్య ఆగ్రహానికి దారితీసిన పరిస్థితులేమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని వైల్డ్‌లైఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ వినయ్ లూత్రా మీడియాకు తెలిపారు.
దసరా గజేంద్రుడికి ఎందుకు తిక్కరేగింది?
Published Tue, Mar 17 2015 7:36 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement