దావూద్, తాలిబన్లు డబ్బులిస్తున్నారు!
సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ 75వ పుట్టినరోజు వేడుకలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఆ వేడుకలకు తాలిబన్ల నుంచి దావూద్ ఇబ్రహీం నుంచి నిధులు వచ్చాయని, అందుకే ఇంత ఆర్భాటంగా చేస్తున్నామని ములాయం సన్నిహితుడు, యూపీ మంత్రి ఆజంఖాన్ ఒకింత ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ములాయం.. రెండు రోజుల పాటు ఈ వేడుకలు చేసుకుంటున్నారు. 75 అడుగుల కేక్ కోస్తున్నారు. ఇంగ్లండ్ నుంచి తెప్పించిన విక్టోరియన్ గుర్రపు బండిలో ఊరేగుతారు. ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే బెలూన్లను భారీ సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా ములాయం బ్యానర్ల వద్ద కట్టారు. రోడ్డు మీద ఉండే డివైడర్లకు కూడా కొత్త రకం పెయింట్లు వేశారు.
అర్ధరాత్రి దాటగానే ములాయం 75 అడుగుల ఎత్తున్న కేకును కట్ చేస్తారు. ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో బాలీవుడ్ గాయనీ గాయకులు వస్తున్నారు. ములాయం కొడుకు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రధాన ఆకర్షణగా ఉంటారు. ఈ కార్యక్రమం అంతా సీనియర్ మంత్రి ఆజంఖాన్ సొంత ఊళ్లో జరుగుతోంది. ఆయనే ఇదంతా చేయిస్తున్నారు.
ఈ ఆర్భాటాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సోసలిస్టుగా రాజకీయ జీవితం ప్రారంభించిన ములాయం.. ఇప్పుడు ఇలా అట్టహాసంగా వేడుకలు చేసుకోవడం ఏంటని విపక్షాల నాయకులు మండిపడుతున్నారు. ఈ విమర్శలతో ఆజంఖాన్కు చిర్రెత్తుకొచ్చింది. డబ్బు ఎక్కడి నుంచి వస్తే ఏంటని ప్రశ్నించారు. తాలిబన్ల నుంచి దావూద్ ఇబ్రహీం నుంచి నిధులు వచ్చాయని ఆగ్రహంగా అన్నారు.