
పాక్‌లో నాలుగు ఇళ్లు మారాడు
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని అతడి సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్ వెల్లడించాడు.
కీలక విషయాలు వెల్లడించిన దావూద్ ఇబ్రహీం సోదరుడు
థానే : అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని అతడి సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్ వెల్లడించాడు. డబ్బుల కోసం బిల్డర్‌ను బెదిరించిన కేసులో సోమవారం కస్కర్‌ను థానే పోలీసులు అరెస్ట్ చేశారు. 8 రోజులు తమ కస్టడీకి అప్పగించడంతో పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.
డీ-కంపెనీ అధినేతగా చలామణి అవుతున్న దావూద్ పశ్చిమ, తూర్పు ఆఫ్రికా దేశాల్లోనూ పెట్టుబడులు పెట్టారని కస్కర్ తెలిపాడు. నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్‌లో దావూద్ నాలుగుసార్లు ఇళ్లు మారాడని వెల్లడించాడు. అంతేకాదు పాకిస్తాన్‌లో తన భద్రతను మరింత పెంచుకున్నాడని చెప్పాడు. తన ఆచూకీ ఎవరైనా కనిపెడతారన్న భయంతో కుటుంబ సభ్యులతో ఫోన్ కూడా దావూద్ మాట్లాడడని తెలిపాడు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతడికి లాటిన్ అమెరికా డ్రగ్స్ వ్యాపారులతోనూ సంబంధాలున్నాయని వెల్లడించాడు.
బెదిరింపుల వ్యవహారంలో దావూద్ ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం గురించి పోలీసులకు కస్కర్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ముంబై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా తన సోదరుడు నడిపిస్తున్నాడని అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు. కస్కర్ వాంగ్మూలంతో దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడన్న విషయం మరోసారి రుజువైంది. అయితే పాకిస్తాన్ మాత్రం మొదటి నుంచి దావూద్ తమ భూభాగంలో లేడని చెబుతూ వస్తోంది.