
అక్కడ ప్రత్యక్ష నరకంలా ఉంది...
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళల పునరావాసం కోసం ఏర్పాటు చేసిన నారీ నికేతన్ నరకానికి నకలుగా ఉందని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ వ్యాఖ్యానించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా రాత్రంతా నారీ నికేతన్లో గడిపామన్నారు. ఈ సందర్భంగగా తమ అనుభవాలను, నారీ నికేతన్ సంస్థలోని పరిస్థితులు, సౌకర్యాల లేమి గురించి స్వాతి మాలివాల్ శనివారం మీడియాకు వెల్లడించారు.
తమకు రాత్రంతా నరకంలో ఉన్న అనుభూతి కలిగిందని స్వాతి తెలిపారు. అక్కడ నెలకొన్ని భయంకరమైన పరిస్థితులను కళ్లారా చూశాక చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. అక్కడున్న మహిళలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతిస్థిమితం కోల్పోయిన మహిళలతో సామాన్య మహిళలు కలిసి జీవిస్తున్నారని, ఒకే మంచాన్ని ఇలాంటి ఇద్దరు మహిళలు పంచుకోవడం చాలా దుర్భరమని వ్యాఖ్యానించారు.
నారీ నికేతన్లో చాలా సమస్యలు, సౌకర్యాలలేమి తమ దృష్టికి వచ్చాయని స్వాతి మాలివాల్ తెలిపారు. విడుదల చేయాలని కోర్టు ఆదేశాలున్నా కొంతమంది మహిళలు ఇంకా నారీ నికేతన్లో ఉండాల్సి వస్తోందన్నారు. కేవలం పోలీసులు, కార్యాలయ అధికారుల సమన్వయ లోపం వల్లనే ఇలా జరిగిందని ఆమె పేర్కొన్నారు. సాధ్యమైనంత వేగంగా నారీ నికేతన్ కార్యాలయంలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.