ఐఎస్ ఉచ్చులో మెడికల్ విద్యార్థిని!
పూణే: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆన్లైన్ ద్వారా టీనేజీ విద్యార్థులకు వల వేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు ఆన్లైన్లో ఇస్లామిక్ స్టేట్ ప్రభావానికి గురైన 17 ఏళ్ల పుణె యువతిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. 'రాడికల్ గన్' పేరుతో ఇంటర్నెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పోలీసులు గుర్తించారు.
ఎస్ఎస్సీలో 90 శాతానికి పైగా మార్కులు సాధించి మెడిసిన్ చదువుతున్న ఆ విద్యార్థిని ఆన్లైన్లో ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారుల ప్రచారానికి ఆకర్షితురాలైంది. తన పూర్తి సమయాన్ని ఆన్లైన్లోనే గడుపుతూ ఇస్లామిక్ స్టేట్కు మద్దతుగా ఫేస్‌బుక్‌లో పోస్టింగ్లు చేయడం మొదలు పెట్టింది. 'రాడికల్ గన్' పేరుతో ఆమె నిర్వహిస్తున్న ఆన్లైన్ వ్యవహారాలపై నిఘా ఉంచిన పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ నుండి తనకు ఆహ్వనం అందిందని, సిరియాలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి రావాల్సిందిగా ఉగ్రవాదులు కోరారని పోలీసుల విచారణలో ఆమె తెలిపింది.
ఇస్లామిక్ స్టేట్ భావజాలానికి ఆకర్షితులైన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్న పోలీసులు ఆ ఉగ్రవాద సంస్థ చీకటి కోణాలను వివరిస్తూ.. ఆ మత్తు నుంచి వారిని బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కౌన్సెలింగ్‌తో మామూలు స్థితిలోకి వచ్చిన ఆ యువతి మాట్లాడుతూ.. 'పోలీసులు మా ఇంటి ముందుకు రాగానే నన్ను అరెస్ట్ చేస్తారని భయం వేసింది. వారు నాకు కౌన్సెలింగ్ నిర్వహించి ఇస్లామిక్ స్టేట్ నిజస్వరూపాన్ని తెలిపారు. ఇది నాకు పూర్తిగా కొత్త జీవితం లాంటిది' అని తెలిపింది.