
న్యూఢిల్లీ : భారత వైమానిక దళానికి చెందిన పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఆస్పత్రిలో కలుసుకున్నారు. పాకిస్తాన్ నుంచి శుక్రవారం రాత్రి వాఘా సరిహద్దు గుండా స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత అభినందన్‌ను ఢిల్లీలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అనంతరం అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రికి తరలించారు. దేశం కోసం అంకితభావంతో పోరాడిన అభినందన్ వర్థమాన్‌ను మంత్రి అభినందించారు. రక్షణ మంత్రి రాక సందర్భంగా యూనిఫామ్ను ధరించి డ్యూటీలో ఉన్న సైనికుడిలా అభినందన్ తయారయ్యారు. పాకిస్తాన్‌లో ఉన్న 60 గంటల సమయంలో ఏమేం జరిగిందో మంత్రికి అభినందన్ వివరించారు. వైద్య చికిత్సల అనంతరం డీ-బ్రీఫింగ్ సెషన్ ప్రారంభం కానుంది. ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు ఐబీ, రా అధికారులు కూడా అభినందన్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.